ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డుల పంట

అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మరోమారు సత్తా చాటింది. ఇప్పటికే పలు గ్లోబల్‌ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్‌గా మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌లో విశేషంగా భావించే ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసి ియేషన్‌’ అవార్డుల్లో ఈ సినిమా ఏకంగా ఐదు పురస్కారాలను దక్కించుకుని హాలీవుడ్‌ సినిమాకు గట్టి పోటీనిచ్చింది. ‘బెస్ట్‌ స్టంట్స్‌’, ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’, ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌’ విభాగాలతో పాటు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా పేరు సొంతం చేసుకుని ‘హెచ్‌సిఏ స్పాట్‌లైట్‌’ అవార్డుని సైతం ఇది దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ‘మా సినిమాకి బెస్ట్‌ స్టంట్స్‌ అవార్డును అందించిన హెచ్‌సిఏ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎంతగానో శ్రమించి ఇందులో స్టంట్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్‌, క్లైమాక్స్‌లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేసిన జూజీతోపాటు మా సినిమా కోసం భారత్‌ వచ్చి, మా విజన్‌ అర్థం చేసుకుని, మాకు అనుగుణంగా మారి, కష్టపడి పని చేసిన ఇతర స్టంట్‌ మాస్టర్స్‌ అందరికీ కృతజ్ఞతలు. సినీ ప్రేమికులను అలరించడం కోసం స్టంట్‌ మాస్టర్స్‌ ఎంతో శ్రమిస్తుంటారు. కాబట్టి ఈ వేడుక ద్వారా ప్రతిష్టాత్మక అవార్డులు అందించే బృందాలకు నాదొక చిన్న విన్నపం. ఇకపై మీ అవార్డుల జాబితాలో స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ విభాగాన్ని కూడా చేర్చాలని కోరుతున్నాను’ అని చెప్పారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో ‘బెస్ట్‌ వాయిస్‌ / మోషన్‌ కాప్చర్‌ పెర్ఫార్మన్స్‌’గా రామ్‌ చరణ్‌ని ఎనౌన్స్‌ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. హాలీవుడ్‌ సినిమాకు అవార్డ్‌ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్‌ చరణ్‌ నిలవడం తెలుగు ప్రేక్షకులకు, భారతీయులకు ఇది ఎంతో గర్వకారమైన క్షణం అని చెప్పాలి.