ఆర్‌ఆర్‌ఆర్‌ సూపర్‌ – జోనాథన్‌ మేజర్స్‌

ఇప్పుడు సినీ ప్రపంచంలో ఎక్కడ విన్నా.. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆస్కార్‌ బరిలో ఉన్న ఈ సినిమాపై హాలీవుడ్‌ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మన తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరం పై కూర్చోబెట్టి, భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. తాజాగా ఈ సినిమా చాలా బాగుందంటూ ప్రముఖ హాలీవుడ్‌ కథానాయకుడు జోనాథన్‌ మేజర్స్‌ కితాబివ్వడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ‘యాంట్‌-మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌: క్వాంటుమానియా’లో సూపర్‌ విలన్‌ కాంగ్‌ ది కాంకరర్‌ పాత్రను పోషించిన జోనాథన్‌ మేజర్స్‌ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసుకోవడం సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచింది. ఇటీవల భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను భారతీయ సినిమాకు అభిమానిని. ఇటీవల బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూశాను. ఈ సినిమా కాంగ్‌ ది కాంకరర్‌ దష్టిని ‘జయించిందని’ చెప్పగలను (నవ్వుతూ). ఈ సినిమాను మూడుగంటల పాటు ఆస్వాదించగలిగాను. ఇద్దరు నటులను (జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. ఇంకా అద్భుతమైన భారతీయ సినిమాలను చూడటానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పారు. జోనాథన్‌ మేజర్స్‌ చేసిన ఈ ప్రకటన ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు గౌరవాన్ని, ప్రజాదరణను పెంచిందని అనడానికి నిదర్శనం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటు..నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈనెల 17న ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషలలో ‘యాంట్‌-మ్యాన్‌ మరియు ది వాస్ప్‌: క్వాంటుమేనియా’ యాన్‌ ఎపిక్‌, సైన్స్‌ ఫిక్షన్‌ అడ్వెంచర్‌ను మార్వెల్‌ స్టూడియో ఇండియా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనుంది.