ఆస్కార్‌ వేదికపై నాటు.. సాంగ్‌ లైవ్‌

అస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ సమయం దగ్గర పడుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే హాట్‌ టాపిక్‌గా మారిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు..నాటు’ పాటని 95వ అస్కార్‌ అవార్డుల వేదికపై లైవ్‌లో చూడబోతున్నారంటూ ఆస్కార్‌ అవార్డ్‌ల కమిటీ బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ‘నాటు..నాటు..’ పాటను పాడిన కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గాయక ద్వయం ఆస్కార్‌ వేదికగాపై తమ గాత్ర సత్తాని మరోసారి చాటబోతున్నారు. తమకి ఈ అవకాశం లభించడాన్ని ఇరువురు ఎంతో బాధ్యతగా భావిస్తున్నామని, తెలుగు సినిమా రంగం గర్వపడాల్సిన తరుణమిదంటూ.. సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు..నాటు’ పాట ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల బరిలోనూ గట్టి పోటీనిస్తోంది.