ఆస్ట్రేలియా, అర్జెంటీనా మ్యాచ్‌ డ్రా

నెదర్లాండ్స్‌ 4-0తో న్యూజిలాండ్‌పై గెలుపు
– హాకీ ప్రపంచకప్‌
భువనేశ్వర్‌: ఒరిస్సాలో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ హాకీ పోటీల్లో నెదర్లాండ్స్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌కు చేరువైంది. పూల్‌-సి సోమవారం జరిగిన పోటీలో నెదర్లాండ్స్‌ జట్టు 4-0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. దీంతో ఈ గ్రూప్‌లో నెదర్లాండ్స్‌ జట్టు వరుసగా 2 మ్యాచుల్లో గెలిచి 6పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో మలేషియా జట్టు 3-2 గోల్స్‌ తేడాతో చిలీని ఓడించింది. చిలీకి చివరి క్షణాల్లో ఒక పెనాల్టీ కార్నర్‌ లభించినా ఆ జట్టు గోల్‌ చేయడంలో విఫలమైంది. దీంతో మలేషియా 3పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మలేషియాతో న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌తో చీలి తలపడనున్నాయి. ఇక పూల్‌-ఏ తొలిమ్యాచ్‌లో ఫ్రాన్స్‌ జట్టు 2-1గోల్స్‌ తేడా తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ టెర్రీ బ్రిక్‌మన్‌(ఫ్రాన్స్‌)కు లభించింది. ఇదే గ్రూప్‌లో అర్జెంటీనా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ 3-3గోల్స్‌తో డ్రా అయ్యింది. నాల్గో క్వార్టర్‌ 55వ నిమిషాల వరకు అర్జెంటీనా జట్టు 3-2గోల్స్‌ ఆధిక్యతలో నిలిచినా.. చివర్లో అర్జెంటీనా జట్టు ఒక గోల్‌ కొట్టడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా, అర్జెంటీనా 4పాయింట్లతో టాప్‌లో ఉండగా… ఫ్రాన్స్‌ జట్టు 3పాయింట్లతో మూడోస్థా నంలో ఉంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రే లియా-దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌-అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి.