ఆ.. పాయింట్‌ ఏంటి?

దండమూడి బాక్సాఫీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్‌ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు గోపీచంద్‌ మలినేని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టీజర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఓ యంగ్‌ డైరెక్టర్‌ (విశ్వంత్‌) మరో పాత్రకు ఓ క్రైమ్‌ కథను చెప్పటంతో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. సిటీలో చాలా వరకు మిస్సింగ్‌ కేసులుగా నమోదు అవుతున్న అమ్మాయిలను ఎవరో హత్య చేస్తుంటారు. ఇంత భయంకరమైన హత్యలను చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు చిక్కదు. దీంతో వారు కేసుని సత్య (సునీల్‌) అనే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. ఆ తర్వాత సత్య ఈ కేసుని ఎలా ఛేదించాడు?, అతను టీజర్‌లో చెప్పినట్లు మిస్‌ అయిన ఓ పాయింట్‌ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ‘కథ వెనుక కథ’ సినిమాని చూడాల్సిందే అన్నట్టుగా టీజర్‌ని మేకర్స్‌ కట్‌ చేశారు. నిర్మాత దండమూడి అవనీంద్ర కుమార్‌ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా, ప్రెస్టీజియస్‌గా రూపొందించినట్లు విజువల్స్‌ చూస్తే క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ రిలీజ్‌ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.