ఇంకా విషమంగానే వైద్య విద్యార్థిని ఆరోగ్యం

– నిందితులు ఎంతటి వారైనా వదలం : మంత్రి సత్యవతి రాథోడ్‌
– నిమ్స్‌లో వైద్య విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి
నవతెలంగాణ- బంజారా హిల్స్‌
వరంగల్‌ కేఎంసీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న పీజీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో బాధితురాలు చికిత్స పొందుతోంది. శుక్రవారం నిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకపక్క మంత్రులు వచ్చి పరామర్శించడం, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం సహా పలువురు ఆరా తీస్తుండగా.. మరోపక్క ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థల వారు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు. ఇలాంటివి రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ మళ్లీ పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. విద్యార్థిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ కమిషనర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వైద్యులతో గంట గంటకు మంత్రి హరీశ్‌రావు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారని చెప్పార. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ డైరెక్టర్‌ను, వైద్య బృందాన్ని ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని వెల్లడించారు. ప్రీతికి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతానికి వెంటిలేటర్‌, ఏక్మో మీద ఉన్నారని, సీఆర్‌ఆర్‌టీ డయాలసిస్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి వెళ్లినప్పుడు వారి మాటలకు ప్రీతి కండ్లు తెరిచి చూడగలుగుతుందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు. ఆమె త్వరగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని మంత్రి ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, వైద్య విద్యారినికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటూ నిందితులను కఠిన శిక్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
గవర్నర్‌ పూలదండతో రావడమేంటి : బాధితురాలి సోదరి
ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్‌ పూలదండతో వచ్చారని బాధితురాలి సోదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. గవర్నర్‌ పూలదండతో రావడమేంటని ప్రశ్నించారు. తన అక్క చనిపోలేదన్నారు. తక్షణమే ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు జరపాలని కోరారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ తన అక్కను చూడటానికి రావద్దన్నారు. తమకు అన్యాయం జరిగితే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.