ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇకపై ఎంసెట్ శిక్షణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేదు. ఇకపై ప్రభుత్వమే ఉచితంగా వారికి ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబరులోనే సిలబస్ పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరిలో కళాశాలల్లోనే ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శిక్షణ కోసం మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత  గ్రూప్ వారీగా ప్రతి జిల్లాలో 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తారు. మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో వీరికి ఉచిత శిక్షణ  ఇస్తారు.