ఇది ప్రగతి పద్దు

 

– రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది
– ఆర్ధిక క్రమశిక్షణ, పటిష్ట కార్యాచరణతో ముందుకు
– సాగునీటిరంగంలో దేశాన్ని మించిన వృద్ధి
– సంక్షేమ పథకాలు ఉచితాలు కాదు
– చేనేతపై ఐదు శాతం జీఎస్టీ సరికాదు

– మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం
– విద్యారంగం మరింత బలోపేతం
– వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
– ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ :
అసెంబ్లీ బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు
– 1.44 గంటలు కొనసాగిన ప్రసంగం
– శాసనమండలిలో పద్దును ప్రవేశపెట్టిన మంత్రి వేముల

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధితో ప్రగతిపథంలోకి దూసుకుపోతున్నదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా పెడుతున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికిలోబడి బడ్జెటేతర రుణాలు సమీకరించిందని చెప్పారు. సోమవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మూడో రోజున 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి శాసనసభలో నాలుగోసారి ప్రవేశపెట్టారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. అలాగే అధికారుల గ్యాలరీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు సైతం ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తూ రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుకాగా, పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపరిచి సభలో ఆమోదించుకున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.15,033 కోట్లు కోత పెట్టి ఈ పరిమితిని రూ.38,937 కోట్లకు తగ్గించినట్టు చెప్పారు. పన్నుల వాటాలో తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా రూ.723 కోట్లు స్పెషల్‌ గ్రాంట్‌ ఇవ్వాలనీ, పోషకాహార కార్యక్రమాల కోసం రూ.171 కోట్లు గ్రాంటు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. 2021-22 సంవత్సరాలకు గానూ 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి రూ.5,374 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖాతరు చేయలేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే…
కేంద్రం కాలయాపనతో రాష్ట్రానికి అన్యాయం
రాష్ట్రంలో కాజీపేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. ఎనిమిదిన్నరేండ్లయినా ఈ హామీలు నెరవేరలేదు. పైగా మంజూరైన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది. నదీజలాల చట్టం సెక్షన్‌ 3ను అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం సూచించాల్సి ఉంది. కానీ కేంద్రం చేస్తున్న అనవసర కాలయాపనతో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కష్ణా నదిపై తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది. 2022 ఆగస్టులో కేంద్ర విద్యుత్‌ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షకు మరో నిదర్శనం. విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.3,441.78 కోట్లను అసలు కింద, రూ.3,315.14 కోట్లను వడ్డీ కింద లెక్క వేసి మొత్తంగా రూ.6,756.92 కోట్లను తెలంగాణ డిస్కంలు ఏపీజెన్‌కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాలిచ్చింది.
తెలంగాణ విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతోంది..
2014-15 రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ.495 కోట్లను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతా రాహిత్యంగా ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశాయి. ఉద్దేశపూర్వకంగానో లేక పొరపాటునో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతోంది.
సాగునీటిరంగంలో స్వర్ణయుగం
ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జల మట్టం పెరిగింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.
పాలమూరు – రంగారెడ్డి 60 శాతం పూర్తి
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయింది. త్వరలోనే పర్యావరణ అనుమతులను సాధించి శరవేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది.ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రానున్న రెండు,మూడేండ్లల్లో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగునీరు అందునుంది. నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు కేటాయించాం.
ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ
రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నెల నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తాం.సెర్ప్‌ ఉద్యోగులకు పే స్కేల్‌ సవరణ చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తాం. దీని విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు గత బడ్జెట్‌లో ఈ పథకాలకు రూ. 2,750 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ. 3,210 కోట్లు ఇచ్చారు.
ఆసరా పింఛన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రూ.200 పింఛన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2016కు, దివ్యాంగులకు రూ.3016కు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని సీఎం నిర్ణయించారు.
విద్యారంగం బలోపేతం : రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేస్తున్నది. పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని విశ్వసించిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,002కు పెరిగాయి.
విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు రూ.7,789 కోట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం ప్రభుత్వం మన ఊరు మన బడి అనే బహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 26,065 పాఠశాలల్లో దశల వారీగా మూడు దశల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. బడ్జెట్‌లో రూ.7,289 కోట్ల నిధులను ఇస్తాం. మొదటి దశలో భాగంగా రూ.3,497 కోట్ల నిధులతో 9,123 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్‌ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాంచాం. ఈ విద్యాసంవత్సరం మహేశ్వరం, మణుగూరులో పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
దళితబంధుకు రూ. 17,700 కోట్లు
దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించాం. స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. పాఠశాలల్లో వంటవాళ్ల పారితోషికాన్ని నెలకు రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
యాదాద్రి పవర్‌ప్లాంట్‌ : నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌ జెన్‌ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులు చివరిదశకు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమెంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్‌ ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది.
కరెంట్‌ కోతలు, పవర్‌ హాలిడేలకు ముగింపు
అన్నిరంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది. రాష్ట్రంలో కరెంటు కోతలు, పవర్‌ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి, సీఎం కేసీఆర్‌ చరిత్ర సష్టించారు.
మండలిలో వేముల : శాసనమండలిలో నాలుగోసారి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వ కేటాయింపులు, వ్యయంపైచర్చించారు. కేంద్ర ప్రభుత్వంతీరుపై విమర్శలు చేశారు.
2023-24 రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు
వివరాలు             (రూ.కోట్లలో)
రెవెన్యూ వ్యయం   2,11,685
పెట్టుబడి వ్యయం 37,525
కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు..
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.450 కోట్లు చొప్పున తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా.. మూడు సంవత్సరాలకు గానూ రూ.1,350 కోట్లు ఇవ్వనేలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు ఇవ్వాలని నిటి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కానీ కేంద్ర సర్కారు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు.