ఇసుక దోపిడీలో కేసీఆర్‌ కుటుంబం

–  ఇదే తంతు కొనసాగితే ఈ ప్రాంతం ఎడారే..
–  ప్రజలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-జమ్మికుంట
క్వారీల పేరుతో కేసీఆర్‌ కుటుంబం ఇసుకను దోపిడీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హాథ్‌ సే హాత్‌ భారత్‌ జోడో యాత్రలో భాగంగా బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల, శంభునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిమళ కాలనీలో ఇసుక క్వారీలను ఆయన సందర్శించారు. ఇసుక తరలింపుతో పంట పొలాలు దెబ్బ తింటున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రేవంత్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీని ప్రజలకు చూపెట్టడానికే ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు కూడబెడు తున్నారన్నారు. అధికారులను అడుగుదామంటే ఒక్కరూ అందుబాటులో లేరన్నారు. మానేర్‌ వాగులో ఈ రకంగా ఇసుక తీస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై స్థానిక శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌, పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజరుకుమార్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్‌సింగ్‌, కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.
బిజిగిరి షరీఫ్‌ దర్గాలో రేవంత్‌ రెడ్డి పూజలు
జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్‌ గ్రామంలో దర్గాలో రేవంత్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని వావిలాల గ్రామంలో ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టను సందర్శించారు. సూపర్‌వైజర్‌తో మాట్లాడి ఖాదీ వస్త్రాల తయారీ, క్రయ, విక్రయాల గురించి తెలుసుకున్నారు.