ఉచిత విద్యుత్‌కు తూట్లు

– లాండ్రీ షాపుల నుంచి బిల్లుల వసూలు
– జహీరాబాద్‌లో ఓ ఇస్త్రీ డబ్బా మీటర్‌కు రూ.36 వేల బిల్లు
– ప్రతి షాప్‌కు బిల్లులిచ్చి వసూళ్లు.. లేకుంటే కరెంట్‌ కట్‌
– ట్రాన్స్‌కో అధికారుల తీరుతో వృత్తిదారులకు తిప్పలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రజక, క్షౌర వృత్తిదారుల లాండ్రీ, సెలూన్‌ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉచిత విద్యుత్‌ పథకం వృత్తిదారులకు ఎంతో మేలు చేస్తున్నా.. ఈ పథకం అమల్లో అక్కడక్కడా ట్రాన్స్‌కో అధికారుల వైఖరి కారణంగా వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో లాండ్రీ షాపు మీటర్‌ బిల్లు రూ.3 వేల నుంచి రూ.36 వేల వరకు వేస్తూ బిల్లు కట్టాల్సిందేనంటూ అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఉచిత విద్యుత్‌పై అధికారులకు అవగాహన చేయించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని వృత్తిదారుల సంఘం నాయకులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎలక్ట్రీసిటీ బిల్‌ కమ్‌ నోటీస్‌ తేదీ 19 డిసెంబర్‌ 2022 సమయం 12.12 గంటలు. బిల్‌ నెంబర్‌ 0097 ఈఆర్‌ఓ నెంబర్‌ 069 జహీరాబాద్‌ ఏరియా కోడ్‌ 0905, సర్వీస్‌ కనెక్షన్‌ నెంబర్‌ 0001 28698, యుఎస్‌సీ 113260548, పేరు చాకలి పాండరి, అడ్రస్‌ 3-1-155 గడీ జహీరాబాద్‌, జిల్లా సంగారెడ్డి పేరిట రూ.36,700 కరెంట్‌ బిల్లు జారీ చేయబడింది. ఇది జహీరాబాద్‌ పట్టణంలోని చాకలి పాండరి అనే నిరుపేద రజక వృత్తిదారుడికి ఉన్న చిన్నపాటి ఇస్త్రీ డబ్బాకు వచ్చిన కరెంట్‌ వినియోగ ఛార్జీల బిల్లు. పాండరి నిరుపేద. సొంత ఇల్ల్లు శిథిలమవ్వడంతో ఓ పాత రేకుల ఇంట్లో కిరాయికి ఉంటూ అక్కడే ఇస్త్రీ చేసుకుంటున్నారు. ఆ ఇంటికి గృహావసరాల కోసం 24133 సర్వీస్‌ నెంబర్‌తో ఒక మీటరు ఉంది. దానితో పాటు ఇస్త్రీ షాపు నడుపుకునేందుకు ప్రభుత్వం ఉచిత కరెంట్‌ కింద ఎంపిక చేసినందున విద్యుత్‌ శాఖ నుంచి లాండ్రీ షాప్‌ కోసం 28698 సర్వీస్‌ నెంబర్‌తో మరో మీటర్‌ పెట్టారు. ఉచిత కరెంట్‌ కోసం మీటర్‌ పెట్టి ఏడాది దాటింది. ఎప్పుడూ కరెంట్‌ బిల్లు ఇవ్వలేదు. తీరా 2022 డిసెంబర్‌ 19వ తేదీన బిల్లు కొట్టి చేతిలో పెట్టారు. అందులో రూ.36700 బిల్లు వేశారు. వచ్చిన బిల్లులో ఉచిత కరెంట్‌ కింద రూ.2641 తీసి వేసి రూ.34484 బిల్లు కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే సర్వీస్‌ నెంబర్‌ 28698 పేరిట 2022 సెప్టెంబర్‌ 17న ఒక బిల్లు ఇచ్చారు. అందులో రూ.175 బిల్లు మాత్రమే ఉంది. ఆ బిల్లును చాకలి పాండరి చెల్లించాడు. డిసెంబర్‌ 19న మాత్రం అదే సర్వీస్‌ నెంబర్‌పై రూ.36700 బిల్లు ఇచ్చిన అధికారులు కనీసం రూ.10 వేలైనా కట్టాలని లేదంటే కరెంట్‌ తీసేస్తామని హెచ్చరించినట్టు పాండరి తెలిపారు.             ఉన్నతాధికారులకు చెప్పినా స్థానిక విద్యుత్‌ ఏఈ, డీఈ పట్టించుకోవడంలేదన్నారు. జహీరాబాద్‌కు చెందిన అల్గోల్‌ పాండు అనే రజకుడి లాండ్రీ షాప్‌కు కూడా రూ.45 వేలు బిల్లు వచ్చింది. మరో షాప్‌కు రూ.25 వేల బిల్లు వేశారు. చాకలి పాండు అనే రజకుడు తన షాప్‌కు రూ.2500 కరెంట్‌ బిల్లు కట్టలేదని కరెంట్‌ కట్‌ చేశారు. బిల్లు కట్టించుకుని తిరిగి కనెక్షన్‌ ఇచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని వీరభద్రనగర్‌లో చాకలి హనుమంతు లాండ్రీషాప్‌ మీటర్‌ నెంబర్‌ 65261508కి ఈ నెల 3వ తేదీన బిల్లు ఇచ్చారు. 59 యూనిట్లు వాడినట్టుగా రూ.1267 బిల్లు వేశారు. స్థానిక లైన్‌మెన్‌ హనుమంతుకు ఫోన్‌ చేసి కరెంట్‌ బిల్లు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. గత నెలలో రూ.600 బిల్లు ఇచ్చారు. నవంబర్‌లో రూ.400 బిల్లు ఇచ్చారు. ఉచిత కరెంట్‌ మీటర్‌కు నెలకోతీరుగా బిల్లు ఇస్తూ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. సంగారెడ్డి పట్టణంలో రాజు అనే వృత్తిదారునికి కూడా రూ.2500 బిల్లు వస్తే కట్టించుకున్నారు. సిద్దిపేట, మెదక్‌, పటాన్‌చెరు, గజ్వేల్‌, హుస్నాబాద్‌, నర్సాపూర్‌, ఆందోల్‌ వంటి ప్రాంతాల్లో కరెంట్‌ బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.

పథకం ఉద్దేశం మంచిదే.. ఆచరణలోనే ఇబ్బందులు
2021 ఏప్రిల్‌ ఒకటి నుంచి హేర్‌ సెలూన్‌ షాపులు, రజకుల లాండ్రీ షాప్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ కింద మెదక్‌ జిల్లాలో లాండ్రీ షాపుల కోసం 1661 మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో ఎక్సిస్టెడ్‌ ఓల్డ్‌ కనెక్షన్‌ 17 మందికి కేటగిరి 2(ఎ) ద్వారా మీటర్లు పెట్టారు. కొత్తగా 1644 మీటర్లు ఇచ్చారు. 3 దోబీ ఘాట్లతో పాటు 889 హేర్‌ సెలూన్లకు ఉచిత మీటర్లు పెట్టారు. సంగారెడ్డి జిల్లాలో 2165 మంది లాండ్రీ షాప్‌ కోసం దరఖాస్తు చేయగా పాతవి 80, కొత్తవి 2013 కలిపి 2093 లాండ్రీ షాపులకు ఉచిత మీటర్లు పెట్టారు. 1433 మంది సెలూన్‌ షాపులు దరఖాస్తు చేసుకోగా పాతవి 566, కొత్తగా 828 సెలూన్లకు ఉచిత మీటర్లు బిగించారు. సిద్దిపేట జిల్లాలో 2637 లాండ్రీ షాపులకు మీటర్లు పెట్టారు. క్యాటగిరి 2(ఎ) కింద ఉచిత మీటర్లు ఇవ్వడంతో యూజర్‌, సర్‌ ఛార్జీలు లబ్దిదారులు చెల్లించాలి. ఎనర్జీ ఛార్జీలు 250 యూనిట్లలోపు అయితే సబ్సిడీ వర్తిస్తది. క్యాటగిరి 2(ఎ) అనేది కమర్షియల్‌ అయినందున లాండ్రీ షాపులకు అధిక బిల్లులు పడుతున్నాయి. దీన్ని ఎల్‌టీ 4 కిందికి మార్చాలని రజక వృత్తిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్యాటగిరిలో అయితే అదనపు ఛార్జీలేవీ ఉండవు. 250 యూనిట్ల వరకు ఉచితం వర్తిస్తుంది. ఆ పైన వినియోగిస్తే యూనిట్‌కు రూ.4 ఛార్జీ మాత్రమే పడుద్ది. దీని వల్ల చిన్నపాటి లాండ్రీ షాపులతో పాటు డ్రై క్లీనర్‌ షాపులకు కూడా ఉపయోగపడుతుంది. ఎల్‌టీ 4 క్యాటగిరి కింత ఇప్పటికే కమ్మరి, కుమ్మరి, అప్పడాల తయారీ వంటి వాళ్లకు ఉచిత కరెంట్‌ వర్తిస్తుంది. పవర్‌లూమ్స్‌కు యూనిట్‌కు రూ.4 లెక్కన ఛార్జీలు పడుతున్నాయి. ఇప్పటికైనా రజకులకు కూడా ఎల్‌టీ 4 క్యాటగిరిలోకి మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఎల్‌టీ 4 క్యాటగిరి కింద మార్చాలి: పైళ్ల ఆశయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్‌ పథకం వల్ల ఉపయోగం జరుగుతుంది. క్యాటగిరి 2(ఎ) కింద కాకుండా ఎల్‌టీ 4 క్యాటగిరి వర్తింపజేయాలి. అప్పుడే రజక వృత్తిదారులకు లాభం జరుగుద్ది. క్యాటగిరి 2(ఎ)లో లాండ్రీషాపుల యజమానులు యూజర్‌, సర్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అవి ఒకేసారి కలిపి బిల్లులుగా వేయడం వల్ల భరించలేని పరిస్థితి ఉంది. ఎల్‌టీ 4కు మార్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌ను, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. ఉచిత విద్యుత్‌ పథకం గురించి లబ్దిదారులకు అవగహన కల్పించాలి. ప్రతి నెలా ఎనర్జీ ఛార్జీలు కాకుండా యూజర్‌, సర్‌ ఛార్జీలు భరించేలా లబ్దిదారులకు అవగహన కల్పించాలి. లాండ్రీషాపుల నుంచి బిల్లులు వసూలు చేయడం ఆపేయాలి.
లాండ్రీ షాపులపై ఒత్తిడి చేయవద్దు: మాదవరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, సంగారెడ్డి
లాండ్రీ షాపుల యజమానులపై కరెంట్‌ బిల్లుల గురించి ఒత్తిడి చేయొద్దని సిబ్బందికి చెప్పాం. క్యాటగిరి 2(ఎ) కింద యూజర్‌, సర్‌ ఛార్జీలు పడతాయి. వాటిని లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటది. అవి ఎప్పటికప్పుడు కట్టుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు. 250 యూనిట్ల లోపు కరెంట్‌ వినియోగించే లాండ్రీషాపుల యజమానుల్ని ఇబ్బంది పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. జోగిపేట, జహీరాబాద్‌లో బిల్లుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని పరిష్కరిస్తాం.