‘ఉపాధి’ని తగ్గించి నిరుద్యోగాన్ని పెంచిన మోడీ

గత కొన్నేళ్ళ అనుభవాలను చూసినట్లైతే కార్పొరేట్‌
రంగానికి ఇస్తున్న పలు రాయితీలు, మినహాయింపులు,
సులభతరమైన రీతిలో రుణాలను అందించినా మరిన్ని
ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమయ్యాయి. కరోనా
మహమ్మారి నెలకొన్న రెండేండ్లలో లిస్టెడ్‌ కంపెనీల
లాభాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కానీ
ఉపాధి కల్పన మాత్రం నిరాశపరిచే రీతిలోనే ఉంది.
ఇందుకు కారణమేంటనే వివరణ ఇవ్వడం చాలా తేలిక.
నిరుద్యోగిత, తక్కువ ఆదాయాల కారణంగా ప్రజల్లో
కొనుగోలు శక్తి తగినంతగా లేకుండా పోయింది.
దానివల్ల వస్తువులు, సేవలకు డిమాండ్‌ తగ్గింది.
ప్రజల జీవితాలు, వారి జీవనోపాధులపై 2023-24 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ పెద్ద దాడి చేసింది. ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు అందించగల పథకాలు, కార్యక్రమాలపై వ్యయాన్ని దేశవ్యాప్తంగా తగ్గించివేశారు. అయితే, విస్మరించిన అంశాలు పెద్దవి, మరింత ఆందోళనకరమైనవి. ప్రజలు ఎదుర్కొనే కీలక సమస్యలను నిర్లక్ష్యం చేయడమో లేదా పట్టీపట్టనట్టు వ్యవహరించడమో చేశారు. వీటిలో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య ఉంది. భారతదేశ జనాభాలో పనిచేయగలిగే యువత ఎక్కువగా ఉందని గొప్పగా చెప్పుకునే అంశాన్ని ఇది నేరపూరితంగా నాశనం చేసింది. గత 41 మాసాలుగా, నిరుద్యోగిత 7శాతానికి పైగానే నమోదవుతూ వస్తోంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే వుంటోందని సిఎంఐఇ సర్వే డేటా తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం నిరంతరంగా అధికంగానే ఉంటోంది. 8-10శాతం మధ్య నమోదవుతోంది. ఇది ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాని అధిక రేటు. ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణితో ఇదిలాగే స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. గత మూడేండ్లలో చూసినట్లైతే, మొత్తంగా ఉద్యోగుల సంఖ్య స్తబ్దుగా ఉంది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2020 జనవరిలో 41.1కోట్ల ఉద్యోగులు ఉంటే 2023 జనవరి నాటికి కూడా 40.9కోట్ల మంది ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇదే కాలంలో, కార్మిక ప్రాతినిధ్యం రేటు (పనిచేయగలిగే వయసులో ఉన్న వారి జనాభా వాటా అంటే పని చేయడమో లేదా ఉద్యోగాలు చూసుకుంటున్న వారి సంఖ్య) 42.9శాతం నుండి 39.8శాతానికి క్షీణించింది. ఈ విభిన్నమైన చర్యలు భయంకరమైన, బాధాకరమైన స్థితి గురించి మాట్లాడుతున్నాయి-జనాభా పెరుగుతున్నా ఉపాధి చేసే వారి సంఖ్య పెరగడం లేదు. పైగా కార్మిక ప్రాతినిధ్య రేటు తగ్గిపోతోందంటే మరింతమంది నిరాశా నిస్పృహలకు గురవుతున్నారని, లేబర్‌ మార్కెట్‌ నుండి బయటకు వెళ్ళిపోతున్నారని అర్ధమవుతోంది. జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని తెలుస్తోంది.అయితే, ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు సృష్టించబడతాయని లేదా దాదాపు 10లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఖాళీలు త్వరలో భర్తీ చేయబడతాయని ప్రభుత్వం, ప్రధాని ప్రజలకు హామీ ఇస్తున్నారు. అందువల్ల, రాబోయే సంవత్సరానికి ద్రవ్య విధానాన్ని నిర్దేశించిన కేంద్ర బడ్జెట్‌లో… కనీసం ఈ ఉద్యోగాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని చర్యలనైనా ప్రకటిస్తారని ఆశించడం సహేతుకమే.
దీనికి భిన్నంగా, నిరుద్యోగితను ఎదుర్కొంటున్న వారికి కొంత ఉపశమనాన్ని కలిగించే ప్రస్తుతమున్న పథకాల్లో కొన్నింటికి నిధులను తగ్గించివేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) నిధులను 33శాతం తగ్గించేశారు. 2022-23 (సవరించిన అంచనాల ప్రకారం)లో రూ.89,400 కోట్లు ఖర్చు పెట్టగా, 2023-24 సంవత్సరానికి రూ.60 వేల కోట్లకు కుదించేశారు. అలాగే, జాతీయ ఉపాధుల కార్యక్రమం (నేషనల్‌ లైవ్‌లీహుడ్స్‌ మిషన్‌) నిధులు కూడా గతేడాది బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయి. ప్రత్యక్ష ఉపాధి పథకాల్లో ఈ కోతలతో పాటు… ఉద్యోగాలు సృష్టించబడతాయనుకున్న గ్రామీణ గృహ నిర్మాణ పథకం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఇతర సంక్షేమ పథకాలకు కూడా కోత పడింది. ఆచరణలో ఐసిడిఎస్‌ నిధుల్లో పెరుగుదల లేదు. అంటే మంజూరైన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల్లో 2.4లక్షల ఖాళీలు ఈ ఏడాది కూడా అలాగే కొనసాగుతాయని అర్థమవుతోంది. అలాగే ఇతర పథకాలకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖలకు సంబంధించినంతవరకు ఇదే పరిస్థితి నెలకొంది.
ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పనా సామర్థ్యాల గురించి, గత విధానాల గురించి అనేక అసత్యాలను ప్రచారం చేయడంలో ప్రభుత్వం, దాని కీలక బాధ్యులు తలమునకలై ఉన్నారు. ఉద్యోగాలను సృష్టించగల మూల ధన వ్యయం కోసం మోడీ ప్రభుత్వం మరిన్ని మొత్తాలను కేటాయిస్తోందనేది వాటిల్లో ఒకటి. అయితే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు పెట్టే దానికన్నా సామాజిక కేటాయింపులకు అంటే విద్య లేదా వైద్యం వంటి రంగాలపై ఖర్చు చేసినట్లైతే ఒక యూనిట్‌ ఖర్చుకు వచ్చే ఉద్యోగాలు మరిన్ని ఎక్కువగా ఉంటాయన్నది ఇక్కడ అందరూ అంగీకరించగలిగిన, సుస్పష్టమైన వాస్తవంగా ఉంది. అలాగే, మోడీ హయాంలో, విదేశీ యంత్రాల వంటి వాటిని మరింతగా దిగుమతి చేసుకోవడంలో మూల ధన వ్యయం ఇమిడి వుంది. అంటే దేశీయ ఉత్పత్తి, స్థానిక ఉద్యోగాలను పణంగా పెట్టి మూల ధన వ్యయంతో చేసుకునే దిగుమతులు పెరుగుతాయి.
పరిశ్రమలకు బ్యాంక్‌ రుణాలను సులభతరం చేయడం వల్ల ఉత్పాదక సామర్ధ్యాలు విస్తృతమవుతాయని అంటే మరిన్ని ఉద్యోగాల సృష్టికి దారి తీస్తుందనేది మరో కట్టుకథ. గత కొన్నేళ్ళ అనుభవాలను చూసినట్లైతే కార్పొరేట్‌ రంగానికి ఇస్తున్న పలు రాయితీలు, మినహాయింపులు, సులభతరమైన రీతిలో రుణాలను అందించినా మరిన్ని ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమయ్యాయి. కరోనా మహమ్మారి నెలకొన్న రెండేండ్లలో లిస్టెడ్‌ కంపెనీల లాభాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కానీ ఉపాధి కల్పన మాత్రం నిరాశపరిచే రీతిలోనే ఉంది. ఇందుకు కారణమేంటనే వివరణ ఇవ్వడం చాలా తేలిక. నిరుద్యోగిత, తక్కువ ఆదాయాల కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి తగినంతగా లేకుండా పోయింది. దానివల్ల వస్తువులు, సేవలకు డిమాండ్‌ తగ్గింది. అయితే రాయితీలు లేదా రుణాలనేవి ఉత్పత్తిని మరింత విస్తరించడానికి, మరింతమంది కార్మికులను తీసుకోవడానికి పరిశ్రమల యజమానులను ప్రలోభపెడతాయి. ఇటువంటి యజమానులకు ప్రభుత్వం రుణాల రూపంలో ఇచ్చే డబ్బంతా వారి లాభాల మార్జిన్‌ను మెరుగు పరుచుకోవడానికే ఉపయోగపడుతుంది.
మొట్టమొదటగా పెద్ద నోట్లరద్దు, ఆ తర్వాత జీఎస్‌టీ దెబ్బ, అటుపై కరోనా మహమ్మారి ఇలా వరుస దెబ్బలతో తీవ్రంగా ధ్వంసమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఇ) గురించి ఏం చెప్పుకోవాలి? ప్రస్తుత బడ్జెట్‌లో హామీ ఇచ్చిన తరహాలో ఈ రంగానికి సులభంగా రుణాలు అవసరం లేదా? భారతదేశంలో 6.33కోట్ల ఎంఎస్‌ఎంఇల్లో 6.30కోట్లు (99శాతం) సూక్ష్మ సంస్థలే. 3.31లక్షలు చిన్న తరహా యూనిట్లు, కేవలం 5వేలు మాత్రమే మధ్య తరహా సంస్థలు. సూక్ష్మ సంస్థల్లో దాదాపు 11కోట్ల కార్మికులు ఉన్నారు. చిన్న తరహా సంస్థల్లో 32 లక్షల మంది ఉన్నారు. మధ్య తరహా సంస్థల్లో కేవలం రెండు లక్షల కార్మికులే ఉన్నారు. కాబట్టి, ఎక్కువ ఉపాధిని సృష్టించేది సూక్ష్మ సంస్థలే. వీటికి నిధులు అవసరం. ఎంఎస్‌ఎంఇ రంగానికి ఉద్దేశించిన రుణంలో చాలా భాగం మధ్యతరహా సంస్థలకు వెళ్ళిపోతోంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చే రుణాలు చాలా తీవ్రంగా పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థలకు కలిపి రూ.2.57లక్షల కోట్లు రుణాలు ఇవ్వగా, సూక్ష్మ సంస్థలకు కేవలం రూ.68.9 వేల కోట్లు మాత్రమే దక్కాయి. దీనంతటిని బట్టి స్పష్టమయ్యేదేమిటంటే నయా ఉదారవాద సిద్ధాంతం మత్తులో పడి మోడీ ప్రభుత్వ కళ్లుమూసుకుపోయాయి. బడా పెట్టుబడిదారుల-దేశీయ, విదేశీ- మీద అది పూర్తిగా ఆధారపడుతున్నది. వారిని ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థకు వారే ఊపు తెస్తారని, ఉద్యోగ అవకాశాలు వాటంతటవే పెరిగిపోతాయన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అసంభవమైన ‘ట్రికిల్‌ డౌన్‌’ సిద్ధాంతంపై దానికున్న నమ్మకమే ఉద్యోగ సంక్షోభ పరిష్కారంపై దృష్టిపెట్టకుండా దాని చేతులు కట్టిపడేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన విధానాలను సమూలంగా మార్చుకునేలా చేయడమో లేక వచ్చే ఎన్నికల్లో దానిని విసిరికొట్టడమో చేయాల్సిన అవసరముంది.
-‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం