ఎంపీ మాగుంట తనయుడు అరెస్టు

– ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుల ఈడీ కస్టడీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. రఘవ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు పది రోజుల ఈడి కస్టడీని విధించింది. అలాగే ప్రతిరోజు గంట పాటు రఘవ రెడ్డిని కలుసుకునేందుకు కుటుంబ సభ్యులు అవకాశం కల్పించింది. శనివారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూలో సీబీఐ ప్రత్యేక కోర్టులోని న్యాయమూర్తి జస్టిస్‌ నరేష్‌ కుమార్‌ లాకా ధర్మాసనం ముందు మాగుంట రాఘవను ఈడీ అధికారులు హజరు పరిచారు. మద్యం విధాన రూపకల్పనలో రూ.వంద కోట్లు చేతులు మారాయని న్యాయస్థానంలో ఈడీ తరపు న్యాయవాది ఎన్‌ కె మట్ట తెలిపారు. సౌత్‌ గ్రూప్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి కీలక వ్యక్తుల ద్వారా పంపించారని పేర్కొన్నారు. మాగుంట రాఘవకు తయారీ, హౌల్‌ సేల్‌ వ్యాపారం, 2 రిటైల్‌ జోన్స్‌ కూడా ఉన్నాయని ఈడీ వివరించారు. రూ. వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.