ఎట్టకేలకు కుదిరింది

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ గురించి గత కొన్నేళ్ళుగా ఎన్నో వార్తలు వినిపించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ఈ వార్తను నిజం చేస్తూ ఆమె టాలీవుడ్‌ తెరపై మెరవబోతోంది. అది కూడా ఏకంగా ఎన్టీఆర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుండటం విశేషం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కొసరాజు హరికష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్‌ మరో అమేజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సోమవారం జాన్వీ కపూర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి నెలలోనే సినిమాను లాంఛనంగా ప్రాంభించి, షూటింగ్‌ని కూడా స్టార్ట్‌ చేస్తారు. ఏప్రిల్‌ 5, 2024న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు.