ఎన్‌ఈపీ పై ప్రజాభిప్రాయ సేకరణ

– జాతీయ ప్రత్యామ్నాయ విద్యావిధానం ముసాయిదా విడుదల
– మార్చి 31 వరకు ఎవరైనా సవరణను సూచించవచ్చు : ఎస్‌ఎఫ్‌ఐ
న్యూఢిల్లీ : కోవిడ్‌ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎవ్వరినీ సంప్రదించకుండా విడుదల చేసిన జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ) ప్రత్యామ్నాయ ముసాయిదా విధానాన్ని ఎస్‌ఎఫ్‌ఐ విడుదల చేసింది. గురువారం నాడిక్కడ ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్ని వర్గాల విద్యార్థులతో కూడిన ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు. మార్చి 31 వరకు ఈ విధానానికి ఎవరైనా సవరణలు, చేర్పులు సూచించవచ్చని ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌ అన్నారు. అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే..దానికి బదులుగా ఎస్‌ఎఫ్‌ఐ జ్ఞాన ఉత్పత్తి విధానాన్ని సమర్థిస్తుందని అన్నారు. ఆరు నుంచి 18 ఏండ్ల వరకు ఉచిత, నిర్బంధ పాఠశాల విద్యను అమలు చేయడం, మాతృభాషలో పాఠశాల విద్య, పిల్లల అభిరుచులను ముందుగానే గుర్తించడం ఈ విధానంలో భాగమని అన్నారు. వికలాంగ విద్యార్థులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీ విద్యార్థులు ప్రత్యామ్నాయ విధానంలో ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారని తెలిపారు. సర్వశిక్షా అభియాన్‌, ట్యూషన్‌ ఫీజులు, స్టైఫండ్‌ల సార్వత్రికీకరణ, డిజిటల్‌ విద్యలో అసమానతలను తొలగించడం, లింగ సమానత్వం, ఉన్నత విద్య, డ్రాపౌట్‌లను తగ్గించడం, ప్లేస్‌మెంట్‌ సెల్‌ల ఏర్పాటు మొదలైన వాటిని సాధికారపర్చడం, చివరి వరకు విద్యను అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ వాదిస్తోందని అన్నారు. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా అన్ని అంశాల్లో ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాభిప్రాయ సేకరణను కూడా నిర్వహించనున్నదని పేర్కొన్నారు. భగత్‌ సింగ్‌ బలిదానం రోజున ‘నఫ్రత్‌ కో హరాయేంగే, ఇంక్విలాబ్‌ లాయేంగే’ అంటూ నినాదాలు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రను బట్టబయలు చేసేలా ప్రచారం జరుగుతోందని తెలిపారు. అన్ని క్యాంపస్‌లలో విద్యార్థి సంఘాల ఎన్నికలు, విద్యార్థులకు రాయితీలు కల్పించాలనే డిమాండ్లతో ఆందోళనలు కూడా ప్రారంభిస్తామన్నారు. అలాగే ఉత్తరాఖండ్‌ జోషిమఠ్‌ నిర్వాసితులకు సేకరించిన వస్తువులను త్వరలో అందజేస్తామని తెలియజేశారు. మయూక్‌ బిస్వాస్‌తో పాటు జేఎన్‌ యూ విద్యార్థి సంఘ అధ్యక్షురాలు ఐషీఘోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణన్‌, సహాయ కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం సాజి, దినిత్‌ దండే కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.