ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు…

– కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. వరంగల్‌ తూర్పు నుంచే పోటీ
– 9న ‘తూర్పు’లో పాదయాత్ర : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘హన్మకొండ జిల్లా పరిధి గోపాల్‌పూర్‌లోని తన భూమిని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ కబ్జా చేయించాడని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నాయకులు కొండా మురళీధర్‌రావు ఆరోపించారు. శుక్రవారం హన్మకొండ జిల్లా రాంనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తన కుమార్తె సుస్మితా పటేల్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదని తెలిపారు. ‘కొండా’ దంపతులు రెండు, మూడు టికెట్లు అడుగుతున్నారని వస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మాకు పదవులు కొత్తేమీ కాదని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఉున్నప్పుడు పదవులను అనుభవించామన్నారు. కొండా మురళికి తగిన పార్టీ కాంగ్రెస్సేనని తెలిపారు. హన్మకొండలోని గోపాల్‌పూర్‌లో తనకు ఎకరం 12 గుంటల భూమి ఉంటే అందులో కేవలం 32 గుంటల భూమి మాత్రమే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అలా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కబ్జాలో స్థానిక ఎమ్మెల్యే వినరుభాస్కర్‌ హస్తముందన్నారు. తమ హయాంలో భూ కబ్జాలు జరగలేదని, ఇప్పుడు వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో భూ కబ్జాలు చూస్తే బాధేస్తుందని చెప్పారు. మాజీ ఏఎస్పీ స్వర్గీయ భాస్కర్‌రావు తన వద్దకు హైదరాబాద్‌ భూమి సమస్యపై వస్తే ఆ సమస్యను పరిష్కరించానని, ఇదే భూమి విషయంలో ఎమ్మెల్యే వినరుభాస్కర్‌, ఆయన తమ్ముని వద్దకు వెళితే అగ్రిమెంట్‌ చేయించుకునేవాళ్లని తెలిపారు. కోవిడ్‌ పేరు చెప్పి రేషన్‌ డీలర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ వాళ్లదన్నారు. దయాకర్‌రావు గత ఎన్నికల్లో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మాయమాటలు చెప్పి సెలైన్‌ బాటిల్‌ ఎక్కించుకున్నాడన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్స్‌ను వెనక్కి తీసుకుంటే మాట్లాడని దయాకర్‌రావుకు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌తో పేదలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఈనెల 9వ తేదీన ప్రారంభం కానుందని, పాదయాత్రలో పాల్గొంటామని, విజయవంతం చేయాలని కోరారు. వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించగా, తమను అడిగి ప్రకటిస్తారని వివరణనిచ్చారు.