ఎరువుల దుకాణంలో రైతు కులం నమోదు అనాగరిక చర్య

–  కేంద్ర ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ తక్షణం రద్దు చేయాలి
–  రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన
నవతెలంగాణ-వైరాటౌన్‌
ఎరువుల విక్రయ కేంద్రంలో రైతు కులం నమోదు అనాగరిక చర్య అని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ రసాయనిక ఎరువులు మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21న ఎరువుల విక్రయ కేంద్రంలో రైతుల కులం నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలని నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం వైరాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీలు కుదించడం కోసం కులం విభజన రైతుల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రైతులు గిట్టుబాటు ధర, మద్దతు ధరలకు చట్టబద్ధత, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా ఎరువులకు ఆధార్‌ కార్డు అనుసంధానం, కుల నమోదు, నగదు బదిలీ ఆలోచన చేస్తూ రైతులను, వాస్తవ సాగుదారులను వ్యవసాయానికి దూరం చేసే చర్యలు వేగవంతం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కుల నమోదు నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రైతు సంఘం జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా నాయకులు సుంకర సుధాకర్‌, గోపవరం సోసైటీ డైరెక్టర్‌ సంక్రాంతి నర్సయ్య, పారుపల్లి కృష్ణారావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.