ఏడు శాతం వృద్థి లక్ష్యం

– విదేశీ వ్యవహారాల మంత్రి వెల్లడి
సిడ్నీ : ప్రస్తుత ఏడాది సహా వచ్చే ఐదేళ్లలో భారత్‌ ఏడు శాతం పైగా వృద్థి రేటును అంచనా వేస్తుం దని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్స్‌ట్యూట్‌ (ఎఎస్‌పిఐ), ఇండియా అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సిడ్నీ బిజినెస్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో మంత్రి మాట్లాడుతూ.. ”ఈ ఏడాది ఏడు శాతం వృద్థిని లక్ష్యంగా పెట్టు కున్నాం. వచ్చే ఐదేళ్లలో మరింత పెరగనున్నాం. రాబోయే దశాబ్దనర కాలంలో 7-9 శాతం వృద్థి రేటును నమోదు చేయనున్నాం. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐ ప్రతిఫలించనున్నాయి.” అని మంత్రి పేర్కొన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య 2022 ఏప్రిల్‌ 2న కుదిరిన ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఇసిటిఎ) డిసెంబర్‌ 2022 నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో మంచి ప్రభావం చూపిందన్నారు. ఆస్ట్రేలియాలో 10 లక్షల పైగా భారత విద్యార్థులు నివసిస్తున్నారన్నారు. భారత మేదో సంపత్తి ఇక్కడికి తరలి వస్తుందన్నారు. ఆస్ట్రేలియన్‌ యూనివర్శిటీలను భారత్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు. దీంతో ఇరు దేశాలు సహా ప్రపంచానికి నైపుణ్యాలు, పోటీ టాలెంట్‌ను అందించగలమన్నారు.