ఏలాంటి అపోహలు వద్దు..

Don't have any misconceptions..– సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ..
– లోలం గ్రామసభలో కలెక్టర్ స్పష్టీకరణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, రాని వారు ఏలాంటి అపోహలు పడవద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో సాలీనా రూ.12 వేల అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగు భూమి లేకుండా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్దారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు.
ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు.రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని  కలెక్టర్ సూచించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలు ,ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. గ్రామ సభలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మండల ప్రత్యేక అధికారి వీరాస్వామి, ఎంపిఓ రాజ్ కాంత్ రావు, డిప్యూటీ తహసిల్దార్ శైలజా,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు మేకల సూవర్త, మాజీ సర్పంచ్ గుట్ట గంగాధర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్,ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్, విస్తరణ అధికారి, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది  అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.