ఒకరి వేతనం ఇద్దరికా!

– ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికుల దీనగాధ పట్టదా
– జీపీ, మున్సిపల్‌ కార్మికులు చేసే పని ఒకటే అయినా వేతనాల్లో తేడాలు
– ప్రతి జీపీ కార్మికునికీ కనీస వేతనం ఇవ్వాల్సిందే: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ఇబ్రహీంపట్నంలోకి ప్రవేశించిన జీపీ పాదయాత్ర
– 230 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యాత్ర
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికులు ఒక్కరి వేతనాన్ని ఇద్దరు పంచుకోవడం ఆందోళన కలిగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం నుంచి ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, రాయపోలు, ముకునూరు గ్రామాల మీదుగా మంచాల మండలంలోకి చేరింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం జరిగిన సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికుల దీనగాధ ప్రభుత్వానికి పట్టడం లేదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు ముగిసి, మూడోసారి ఎన్నికలకు పోనున్న తరుణంలోనూ కార్మికుల బతుకుల్లో మార్పు రావడంలేదన్నారు. చేసే పని ఒకటైన మున్సిపల్‌, పంచాయతీ కార్మికుల వేతనాల్లో వ్యతాసాలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లతో పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర కార్మిక చట్టాలు సంక్షేమానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బందిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన పేదలు మాత్రమే ఉన్నారని తెలిపారు. పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేసి కనీస వేతనం నిర్ణయించాలని సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా అశాస్త్రీయంగా జీవో 51 విడుదల చేసిందని విమర్శించారు. 500 మంది జనాభాకు ఒక కార్మికుడి చొప్పున లెక్కించే వేతనాన్ని రూ.8500 నిర్ణయించిందన్నారు. అదనంగా ఉన్న కార్మికులకు ఏలాంటి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఒక కార్మికునికి ఇచ్చే వేతనాన్ని అక్కడ పనిచేసే కార్మికులందరూ పంచుకుంటే, ఒక్కో కార్మికునికి రూ.3500 నుంచి రూ.4వేల వేతనాలు పొందాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కనీస వేతనం నెలకు రూ.26వేలకు తగ్గకుండా ఇవ్వాలన్నారు. జీవో నెంబర్‌ 60 ప్రకారం పారిశుధ్య కార్మికులకు రూ.15,600, కారోబార్‌ బిల్లు కలెక్టర్లకు రూ.19,500, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.22,750 చొప్పున వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలన్నారు. జీవో నెంబర్‌ 51ని సవరించి మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. పంచాయతీ కార్మికులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5.50లక్షల చొప్పున అందజేయాలని కోరారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర బృందంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తునికి మహేష్‌, పి.వినోద్‌ కుమర్‌ ఉన్నారు. వారితో పాటు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. కిషన్‌, డి. జగదీష్‌, రవికుమార్‌, నాయకులు ఈ నరసింహ, స్వప్న, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు సామెల్‌, రైతు సంఘం నాయకులు వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్‌ జంగయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జగన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చరణ్‌ తదితరులు ఉన్నారు.