కనీస వేతనాలను సవరించండి

–  కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదినికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో షెడ్యూల్‌ ఎంప్లాయీ మెంట్స్‌లో కనీస వేతనాలను సవరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదినికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కనీస వేతనాల సలహా మండలి సభ్యులు భూపాల్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్‌ వినతిపత్రాన్ని అందజేశారు. 75 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో వేతనాలు సవరించ లేదనీ, దీనివల్ల కోటి మందికి పైగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. 2014 నుంచి ఇప్పటివరకు రెండుసార్లు కనీస వేతనాల సలహా మండలి రాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు ప్రతిపాదనలు పంపితే పెండింగ్‌లో పెట్టడం దారుణమని పేర్కొన్నారు. కనీస వేతనాలు సవరిస్తూ వెంటనే జీఓలు ఇవ్వాలని కోరారు. చట్టప్రకారం ప్రభుత్వం మూడుసార్లు వేతనాలు సవరించక పోవడం వల్ల కార్మికులు ఆర్ధికంగా నష్టపోయారన్నారు. యజమానులు చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల పరిశ్రమల యజమానులు విపరీతంగా లాభాలు పొందారని గుర్తుచేశారు. 2021 జూన్‌లో ఐదు రంగాలకు జీఓ నెం.21, 22, 23, 24, 25 ఫైనల్‌ నోటిఫికేషన్స్‌ ఇచ్చారనీ, అన్‌స్కిల్డ్‌ వర్కర్‌కు మినిమం బేసిక్‌ రూ.18,019, వీడీఏ రేటు రూ.12 నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. గెజిట్‌ చేయకపోవడం వల్ల అవి అమల్లోకి రాలేదని వాపోయారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 90 శాతం ఉందనీ, అందులోనూ అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. వారికి కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌ గానీ, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అమలు చేయడంలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వలస కార్మికుల రక్షణ కోసం కనీస చర్యలు తీసుకోవడం లేదనీ, కార్మిక శాఖ ద్వారా అన్ని పరి శ్రమల్లోనూ తనిఖీలు చేయించాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని విన్నవించారు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికత దృష్ట్యా రోజుకు 7 గంటలు, వారానికి 5 రోజుల పని దినం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వలస కార్మికులకు 1979 అంతర్‌ రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారం హక్కులు అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భం గా ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాణి కుముదిని మాట్లాడుతూ హైకోర్టులో కొందరు కేసు వేయడం వల్ల, కొత్తగా బోర్డు నామినేట్‌ చేయాల్సి ఉండటంతో జీఓలు ఇవ్వడం ఆలస్య మైందని తెలిపారు. సీఐటీయూ వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభు త్వానికి పంపుతామనీ, సమస్యలను పరిష్కారమయ్యేలా చూస్తామని హామీనిచ్చారు.