కార్పొరేట్లకే కేంద్ర బడ్జెట్ అనుకూలం..

– బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం..
– ఈనెల 10న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్, మహా ధర్నా..
– విజయవంతం చెయ్యాలని పిలుపు..
– రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచా అశోక్, కార్యదర్శి ముక్తి కాంతా అశోక్..
 నవతెలంగాణ – వేములవాడ 
 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, తెలంగాణకు తీరని అన్యాయం చేశారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచా అశోక్, కార్యదర్శి ముక్తి కాంతా అశోక్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, కార్యదర్శి ముక్తి కాంతా అశోక్ లు మాట్లాడుతూ సంక్షేమ రంగాన్ని విస్మరించిన బడ్జెట్ ను నిరసిస్తూ ఈనెల ఫిబ్రవరి10న ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులు కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు , యువకులు , మహిళలు , సామాజిక సంఘాల ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఆధాని, అంబానీ లకు అనుకూలంగా పూర్తిగా పేదలు, కార్మికులు, రైతులు, కూలీల వ్యతిరేక బడ్జెట్ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 50 లక్షల 60 వేల కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారాని విమర్శించారు. ఎరువుల రాయితీలలో 16,900 కోట్లు, ఆహార భద్రతా రాయితీలలో 14,454 కోట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీలలో 9910 కోట్లు, గ్రామీణాభివృద్ధి రాయితీలలో 50 వేల 518 కోట్లు, ప్రధాని ఆవాస యోజన గృహ నిర్మాణ పథకంలో 293 కోట్లు, పట్టణ అభివృద్ధిలో 4,835 కోట్లు తగ్గించారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో 30 కోట్ల మంది పనిచేస్తున్నారని వారికి 15 కోట్ల జాబ్ కార్డులు ఉన్నాయని రెండు లక్షల 50 కోట్ల నిధులు అవసరం ఉండగా కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారాని విమర్శించారు. కార్పొరేటు ధనవంతులు చెల్లించే ప్రత్యక్ష పన్నులను తగ్గించి మధ్యతరగతి పేదలు చెల్లించే పరోక్ష పనులను పెంచారని తెలిపారు. కార్పొరేట్ పన్నులు 30 శాతం నుంచి 22 శాతం తగ్గించారాని, పేదలు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నందున వాటి ద్వారా అన్ని రకాల పేదలు చెల్లించే పన్నులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే కూరగాయలు, పప్పులు, పండ్లు, పసుపు, ఉప్పు, నూనె, కారం, నిత్యవసరాలు పన్నులు పెరిగాయని అన్నారు.తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఒక్క రూపాయి రాష్ట్రానికి తీసుకురా అని అసమర్ధుల ని ఇక్కడి పార్లమెంట్ సబ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేసి తెలంగాణ తరుపున పోరాడాలని చెప్పారు. రాష్ట్రానికి నిధులు తెస్తారా.. రాజీనామా చేస్తారా.. ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్రంలో బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలుగా ఉన్న కేరళ , తమిళనాడు , తెలంగాణకు బడ్జెట్ నిధులలో తీవ్ర వివక్ష చూపించారని విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న జరిగే మహా ధర్నాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.