కార్మికోద్యమం బలోపేతమవ్వాలి

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ – మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కార్మికోద్యమం మరింత బలోపేతం అవ్వాలని, సంఘటిత పోరాటాల ద్వారానే మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, లేబర్‌ కోడ్‌లను తిప్పికొట్టగలుగుతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అన్నారు. సిద్దిపేటలోని మల్లుస్వరాజ్యం నగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. లేబర్‌ కోడ్‌లతో ప్రమాదాన్ని కార్మికవర్గానికి అర్థం చేయిస్తూ వారిని పోరాటాల్లోకి తీసుకొచ్చే కర్తవ్యాన్ని ఈ మహాసభ తీసుకోవాలన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోరాటాల్లో కలిసి రావాలని మహాసభ పిలుపునిస్తున్నదని చెప్పారు. కార్మిక చట్టాలు, వేతన సమస్యలతో పాటు రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాజిక తరగతుల ప్రజల సమస్యలపై సీఐటీయూ క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకుని అనే ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా పాలుపంచుకున్నదని పలు ఉదాహరణలు చెబుతూ వివరించారు.