కులం చెపితేనే ఎరువులు

–  కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌
–  అనాలోచిత నిర్ణయం : ఏఐకేఎస్‌
సబ్సిడీ ఎరువులు కావాలంటే కులాన్ని నమోదు చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎరువుల రాయితీలు పొందడానికి ఎరువుల దుకాణాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మెషీన్లను ప్రవేశపెట్టి.. తప్పనిసరి ‘కులం’ నమోదు చేయాలనే కేంద్రం ఆదేశం రైతులను ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఇది మధ్యతరగతి, పేద రైతుల సబ్సిడీలపై ప్రభావం చూపుతుందని ఏఐకేఎస్‌ విమర్శించింది.
న్యూఢిల్లీ : రైతులకు అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయం ప్రభుత్వ, ప్రయివేట్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌లలో అమర్చబడిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పరికరాలతో చేయబడుతుంది. ఆధార్‌ కార్డులు, కేసీసీ, ఓటర్‌ ఐడీలతో లబ్దిదారులను గుర్తిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2.60 లక్షల పీఓఎస్‌ పరికరాలను ఇన్‌స్టాల్‌ చేశారు. ”కొనుగోలుదారుల కేటగిరీలో కొత్త అప్‌డేట్‌ ప్రకారం.. రాయితీ పొందడానికి పీఓఎస్‌ లో ‘సేల్‌ టు ఫార్మర్‌’ ఎంట్రీ కింద రైతుల కుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. కుల ఎంపికలుగా జనరల్‌, ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), షెడ్యూల్డ్‌ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లు పేర్కొంది. ఎరువుల విక్రయ సమయంలో వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం తప్పనిసరి” అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫెర్టిలైజర్స్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏఐకేఎస్‌ ఖండన ఎరువుల దుకాణాల్లోని పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఓపీఒపిఎస్‌) మెషీన్‌ల వద్ద కులానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలనే నిర్ణయాన్ని ఏఐకేఎస్‌ ఖండించింది. ఈ మేరకు ఏఐకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూకృష్ణన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎరువుల రాయితీని పొందడం కోసం పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఓపీఎస్‌) మెషీన్ల వద్ద తప్పనిసరిగా కుల వర్గాన్ని నమోదు చేయాలనే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అనాలోచితమని పేర్కొన్నారు. ఈ తిరోగమన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను డిమాండ్‌ చేశారు. రైతులు తమ కుల వివరాలను నమోదు చేయాలని కోరారనీ, అయితే కుల, మతాలకు అతీతంగా ప్రజలు వ్యవసాయం చేస్తున్నారనీ, ఎరువులు కొనడానికి ఈ వివరాల సేకరణ పూర్తిగా అనవసరమనీ, బయోమెట్రిక్‌ వాడకం తరచుగా మినహాయింపు కోసం ఒక సాధనంగా మారుతుందని విమర్శించారు. ప్రస్తుతం ఎరువుల సబ్సిడీల విధానం నుంచి డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) స్కీమ్‌కి మారే దిశగా మోడీ ప్రభుత్వం ఎరువుల విక్రయానికి ఆధార్‌తో అనుసంధానించబడిన పీఓఎస్‌ మెషీన్‌ల తప్పనిసరి వినియోగాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఎరువుల విక్రయం
కోసం ఓపీఎస్‌ యంత్రాలను ఉపయోగించడం, ఎరువుల సబ్సిడీలను డీబీటీకి మార్చే ప్రయత్నాలను ఏఐకేఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. వంటగ్యాస్‌ సబ్సిడీలను డీబీటీకి మార్చిన అనుభవం ఉందనీ, డీబీటీ సబ్సిడీ పథకాలు సబ్సిడీలను పూర్తిగా ఉపసంహరించుకునే ఎత్తుగడ తప్ప మరొకటి కాదని తేలిందని స్పష్టం చేశారు. వ్యవసాయంలో డీబీటీ పథకాలు భూమి రికార్డులతో అనుసంధానించబడి, భూమిలేని, కౌలు రైతులను సబ్సిడీల ప్రయోజనం నుంచి మినహాయించాయని తెలిపారు. ఎరువుల సబ్సిడీ ధరలను తగ్గించాలనీ, ప్రభుత్వం నియంత్రిత ధరలకు తగినన్ని ఎరువులు సరఫరా చేయాలని కోరారు. రైతులు తెచ్చిన ఒత్తిడితో ఎరువుల ధరలు పెరగకుండా రెండేండ్లుగా నియంత్రించగలిగినప్పటికీ… వాటి సరఫరా భారీగా తగ్గిందని గుర్తుచేశారు. దీంతో రైతులకు కావాల్సినన్ని ఎరువులు అందుబాటులో లేకపోవటంతో బ్లాక్‌ మార్కెటింగ్‌ జోరుగా సాగుతున్నదని తెలిపారు. కులం సమాచారాన్ని సేకరించేందుకు తీసుకున్న ఈ తిరోగమన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎస్‌ డిమాండ్‌ చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆధార్‌-సీడ్‌ పిఒఎస్‌ మిషన్ల తప్పనిసరి వినియోగాన్ని ఉపసంహరించుకోవాలనీ, రైతులకు తగినన్ని ఎరువులు నియంత్రిత ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.