‘పేపర్ బాయి’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం తాజాగా మంగ్లీ పాడిన తొలి పాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. ఈ పాట శ్రీ కష్ణుడుపై సాగే అద్బుతమైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఈ గీతాన్ని తెలంగాణలోని మొదటి హరేకష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ఈ చిత్రంలో శ్రీ కష్ణ తత్వాన్ని చిన్న చిన్న పదాలతో చెప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశం నాకు దేవుడే ఇచ్చాడు అని భావిస్తున్నాను. లక్ష్మీ నరసింహ స్వామి మా ఇలవేల్పు. ఆ దేవుని సమక్షంలో ఈ పాట విడుదల చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాను. కష్ణతత్వాన్ని చిన్న చిన్న పదాల్లో చెప్పే అవకాశం నాకు ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు, ఇస్కాన్ టెంపుల్ వారికి కతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పాటలో అనేక పద ప్రయోగాలు చేశాను. అలాంటి ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని గీత రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ, ‘ఈ పాటను శ్యామ్ చాలా గొప్పగా రాశారు. మంగ్లీ గాత్రంలో మరింత అందంగా వినిపిస్తోంది. అనూప్ రూబెన్స్ బాగా కంపోజ్ చేశారు. ఇప్పటికే యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోందీ పాట. ఈ పాటే కాదు సినిమా కూడా చాలా బావుంటుంది. డైలాగ్స్, స్క్రీన్ ప్లే దర్శకుడు జయశంకర్ చాలా బాగా రాసుకున్నారు’ అని తెలిపారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ‘కథ ప్రకారం కష్ణుడు గురించి అందరికీ అర్థమయ్యేలా ఓ పాట కావాలని శ్యామ్ వద్దకు వెళ్లాను. ఆయన కేవలం ఒక్క వారంలోనే కష్ణుడి ఫిలాసఫీని, గీత తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా అద్భుతంగా రాసి ఇచ్చారు. ఈ పాట ద్వారా ఓ మంచి ఫిలాసఫీని చెప్పాం. మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. ‘ఇందులో నేనొక మంచి పాత్ర చేశాను. కృష్ణతత్త్వాన్ని అద్భుతంగా చెప్పారు’ అని నటుడు సాయికుమార్ చెప్పారు.