క్రమబద్ధీకరణ పేరుతో హాస్టల్స్‌ విలీనం సరిగాదు

– ఆ ఆలోచనను విరమించుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
క్రమబద్ధీకరణ పేరుతో హాస్టళ్లను విలీనం చేయాలనే ఆలోచనను రాష్ట్ర సర్కారు విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఆదివారం ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి, టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 50 మంది కంటే తక్కువ విద్యార్ధులున్న హాస్టళ్లను దగ్గరలో ఉన్న మరో హాస్టల్‌లో విలీనం చేయాలనీ, లేదంటే పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌గా మార్చాలనే ఆలోచనలో క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఉండటం దారుణమని పేర్కొన్నారు. గ్రామీణ, ఆదివాసీ, దళిత విద్యార్ధుల విద్యాభివృద్ధికి పట్టుకొమ్మలుగా హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులను దగ్గరలోని హైస్కూల్స్‌ నుంచి హాస్టల్స్‌లో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వారికి మెరుగైన సదుపాయాలు, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచకుండా వాటిని నిర్వీర్యం చేయాలని చూడటం అన్యాయమని తెలిపారు. క్రమబద్ధీకరణ పేరుతో హాస్టళ్లను మూసివేసే కుట్రలను మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే నిధులు మంజూరు చేసి వాటిలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.