గర్భంలో ఉండగానే…మన సంస్కృతీ..విలువలు నేర్పాలి..

–  గర్భస్థ శిశువు డీఎన్‌ఏ మార్చొచ్చు..
–  జేఎన్‌యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘గర్భ సంస్కార్‌’ కార్యక్రమం
న్యూఢిల్లీ : ‘గర్భంలో ఉండగానే శిశువుకు సాంస్కృతిక విలువలు’ నేర్పించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి ‘గర్భ సంస్కార్‌’ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. సమవర్ధినీ న్యాస్‌ అనే సంస్థ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీలో ఒక వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ప్రముఖ గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు హాజరయ్యారు. గర్భంలో ఉన్నప్పుడే శిశువుకు భారతీయ సంస్కృతి, విలువలు నేర్పించాలని, ఆ దిశగా గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించాలని గైనకాలజిస్టులను, ఇతర వైద్యులను ‘సమవర్ధినీ న్యాస్‌’ జాతీయ కార్యదర్శి మాధురీ మరాథే కోరారు. ”17వ శతాబ్దంలో జీజాభారు ‘శివాజీ’కి అలాంటి విషయాలే చెప్పింది. మహిళల పట్ల గౌరవం, దేశభక్తి కలిగిన పిల్లల్ని తయారుచేయాలంటే గర్భంలో ఉండగానే విలువలు నేర్పాలి” అని అన్నారు.’గర్భ సంస్కార్‌’ అనే కాన్సెప్ట్‌ను సమవర్ధినీ న్యాస్‌ రూపొందించింది. భగవద్గీత, రామాయణంలోని శ్లోకాల్ని గర్భిణీలకు వినిపించటం, యోగా ఆసనాలు వేయటం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. ప్రతిఏటా కనీసం వెయ్యిమంది గర్భిణీ స్త్రీలతో ‘గర్భ సంస్కార్‌’ అమలయ్యే విధంగా చూడాలని వర్క్‌షాప్‌కు హాజరైన గైనకాలిజిస్టులను, వైద్యులను వక్తలు కోరారు. శ్వేతా డాంగ్రా అనే వక్త మాట్లాడుతూ, ”కొంతమంది పిల్లల్లో హోమో సెక్సువల్‌ లక్షణాలు ఉండటానికి కారణం తల్లిదండ్రులే. మొదటి ప్రసవంలో మగశిశుపుట్టాక, రెండోసారి ఆడశిశువు కావాలని కోరుకుంటున్నారు. అలా తల్లి రెండవ సంతానం ఆడపిల్ల కావాలని ఆశిస్తూ మగబిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ ‘హోమో సెక్సువల్‌’గా మారొచ్చు’ అని అన్నారు. మరికొంత మంది వక్తలు మాట్లాడుతూ, ”గర్భ సంస్కార్‌..ప్రక్రియ చేపడితే..శిశువు డీఎన్‌ఏ కూడా మారుతుంది” అని చెప్పారు.