– టీఎస్‌పీఎస్సీకి డీవైఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2, గ్రూప్-3 దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అధికారులను బుధవారం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జావిద్, నాయకులు నవీన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. ఇంటర్‌నెట్, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా గడువు సమయానికి దరఖాస్తు చేసుకోలేక పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. అర్హత ఉన్నా దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మరోసారి దరఖాస్తు గడువును పెంచి వారికి అవకాశం కల్పించాలని కోరారు.