చట్ట ప్రకారం కొనుక్కున్న భూముల మీద దౌర్జన్యం ఏంది?

–  జీవో నెంబర్‌ 15 ను వెంటనే రద్దు చేయాలి : వక్ఫ్‌ బోర్డ్‌ బాధితుల జేఏసీ డిమాండ్‌
– ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా
నవ తెలంగాణ – అడిక్‌మెట్‌
చట్ట ప్రకారం కొనుకున్న వక్ఫ్‌ బోర్డ్‌ భూముల మీద ప్రభుత్వ దౌర్జన్యం ఏందని.. బొడుప్పల్‌ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వక్ఫ్‌ బోర్డ్‌ బాధితుల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆదివారం వక్ఫ్‌ బోర్డ్‌ బాధితుల జేఏసీ అధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహారదీక్షలు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌లో నిర్వహించారు. ఈ దీక్షకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరై మాట్లాడారు. బోడుప్పల్‌లో ఇండ్లు కట్టుకుని దశాబ్దాల నుంచి 7 వేల కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. వారు అన్ని రకాల ఛార్జీలు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. అయితే 2018 వరకు ప్రయివేటు భూమి అని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలైపోగానే అవి వక్ఫ్‌ భూములని అమ్మకాలు, కొనుగోలు బంద్‌ చేయించారన్నారు. బోడుప్పల్‌లో భూములు కొన్నప్పుడు ఏ లిటిగేషన్‌ లేదని ప్రభుత్వమే క్లియరెన్స్‌ ఇచ్చిందని.. మరి ఇన్నేండ్ల తరువాత ఇప్పుడు వక్ఫ్‌ భూములని ఎలా అంటారని ప్రశ్నించారు. అప్పుడు వక్ఫ్‌ భూములని ప్రభుత్వానికే సోయి లేకపోతే కొన్న ప్రజలకు ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. ఏనాడూ బయటికి వెళ్లని వారు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి సోయి ఉందా అని ప్రశ్నించారు. కొద్దిమంది మెప్పు కోసం ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదాయం కోసం ప్రభుత్వ, బంజరు భూములను అమ్ముతున్న సర్కారు.. బోడుప్పల్‌ భూముల సమస్యను ఎందుకు పరిష్కరించదని ప్రశ్నించారు. వక్ఫ్‌ భూమి అని చట్టం నిర్ణయిస్తే వారికి ఎక్కడన్నా భూమి కేటాయించాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల విడుదల చేసిన జీవో 15 వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన దీక్షలో జేఏసీ కన్వీనర్‌ శ్రీధర్‌ రెడ్డి, కో చైర్మెన్‌లు, కార్పొరేటర్‌ కుంభం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కొత్త దుర్గమ్మ, పోగుల నర్సింహారెడ్డి, కిషోర్‌ గౌడ్‌, జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.