జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌

– ప్రపంచ వ్యాప్తంగా ఉద్వాసన
న్యూఢిల్లీ: గడిచిన జనవరి లో ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజీ కంపెనీలు లక్ష మంది ఉద్యోగుల కు ఉద్వాసన పలికాయి. ఐటి రంగంలో ఎప్పుడూ లేనంత దారుణంగా కోతలు చోటు చేసుకున్నాయని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ఓ రిపోర్టులో తెలిపింది. దిగ్గజ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, సేల్స్‌ఫోర్స్‌ తదితర ఇతర సంస్థలు ఉద్వాసనలకు పాల్పడ్డాయని వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. ”ప్రతీ రోజు 3,300 చొప్పున ఉద్యోగాలు ఊడాయి. ప్రపంచంలోని 288 పైగా కంపెనీలు ఈ చర్యకు పాల్పడ్డాయి. దిగ్గజ టెక్‌ కంపెనీల్లో ఒక్క ఆపిల్‌ మాత్రమే ఎలాంటి తొలగింపులు చేయలేదు. అమెజాన్‌ 18,000 మందికి ఉద్వాసన పలికింది. అదే విధంగా గూగుల్‌ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్‌ 10వేల మందిని, సేల్స్‌ఫోర్స్‌ 7,000 మంది, ఐబిఎం 3,900 మంది, ఎస్‌ఎపి 3,000 మంది చొప్పున ఉద్యోగులను తొలగించాయి.” అని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెల్లడించింది. 2022లో 1,000 కంపెనీలు 1,54,336 సిబ్బందిని ఇంటికి పంపించాయి. గతేడాదితో కలుపుకుని ఇప్పటి వరకు 2.5 లక్షల ఉద్యోగాలు పోయినట్లయ్యింది. ఆర్థిక సంక్షోభం భయాల నేపథ్యంలో అనేక టెక్‌ కంపెనీలు పొదుపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒఎల్‌ఎక్స్‌ కూడా తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. బైజూస్‌ కూడా మరో రౌండ్‌లో 15 శాతానికి సమానమైన 1,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఐటి రంగ అభ్యర్థుల్లో, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.