జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉత్తర్వులు నిలుపుదల

– హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ సంస్థల్లో 2009 నుంచి నేరుగా నియమించబడిన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన చెయ్యాలని 2001లో ట్రాన్స్‌కో 954ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని విద్యుత్‌ సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఎస్సీ కమీషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్‌ గతేడాది నవంబర్‌ 29న విచారణ జరిపి, విద్యుత్‌ సంస్థల్లోని జీవో నంబర్లు 954, 62, 101, 37లపై యథాతధస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఓసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని బీసీ, ఓసి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్తంగా హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానిలో జాతీయ ఎస్సీ కమీషన్‌ ఉత్తర్వులను సవాల్‌ చేశారు. సమితి తరఫు అడ్వకేట్‌ సుంకర చంద్రయ్య వాదనలతో ఏకీభవించిన హైకోర్టు విచారణ అనంతరం, జాతీయ ఎస్సీ కమీషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు సమితి ప్రతినిధులు శనివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్లకు విచారించి ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని చెప్పిన అంశాన్ని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సమితి తెలిపింది.