జై భీమ్‌ దర్శకుడితో సినిమా

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ తన 170వ చిత్రానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చి అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘జైలర్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందబోయే ‘లాల్‌ సలాం’ చిత్రంలోనూ ఆయన నటించనున్నారు. ఇందులో రజనీ చెల్లెలుగా జీవిత రాజశేఖర్‌ కనిపించనుండటం విశేషం. ఇదిలా ఉంటే, రజనీ 170వ చిత్రానికి సంబంధించి ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ గురువారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘తలైవా.. 170వ చిత్రాన్ని మేం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. దీనికి ‘జై భీమ్‌’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు’ అని నిర్మాత సుభాస్కరన్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.