టీ-వర్క్స్‌ ప్రభుత్వ డిజైన్‌

–  ప్రతిష్టాత్మకంగా నిర్మాణం
–  ఫాక్స్‌కాన్‌ చైర్మెన్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీ-వర్క్స్‌ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా డిజైన్‌ చేసిందని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌, ఇమేజ్‌ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గురువారంనాడాయన ఫాక్స్‌ కాన్‌ చైర్మెన్‌ యంగ్‌ లియూతో కలిసి దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ప్రజల కోసం ఈ నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నదని చెప్పారు. రోజువారీ అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలనే ఆలోచన నుంచి టీ-వర్క్స్‌ ఆవిష్కరణ జరిగిందన్నారు. ఇప్పటివరకు 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించామనీ, మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉన్నదని వివరించారు. టీ-వర్క్స్‌ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉన్నదని, ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, సోర్సింగ్‌, మెటీరియల్స్‌, ఇతర అంశాలపై నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరి స్తారని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీ వర్క్స్‌ సీఈవో సంజరు, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.