ఢిల్లీ ధనాధన్‌

–  షెఫాలీ, మెగ్‌ లానింగ్‌ అర్థ సెంచరీలు
–  బెంగళూర్‌ 60 పరుగుల తేడాతో గెలుపు
ముంబయి : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో పరుగుల వరద పారుతోంది. ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 200కు పైగా పరుగులు చేయగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. షెఫాలీ వర్మ (84, 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), మెగ్‌ లానింగ్‌ (72, 43 బంతుల్లో 14 ఫోర్లు) మెరుపు అర్థ సెంచరీలతో కదం తొక్కగా తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మరిజానె కాప్‌ (39 నాటౌట్‌,17 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), జెమీమా రొడ్రిగస్‌ (22 నాటౌట్‌, 15 బంతుల్లో 3 ఫోర్లు) డెత్‌ ఓవర్లలో దండయాత్ర చేశారు. ఓపెనర్లు షెఫాలీ, లానింగ్‌ తొలి వికెట్‌కు రికార్డు 162 పరుగులు జోడించారు. ఇక ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ చతికిల పడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి 60 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ టారా నోరిస్‌ (5/29) ఐదు వికెట్ల ప్రదర్శనతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. బెంగళూర్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మంధాన (35), హీథర్‌ నైట్‌ (34), మేఘన్‌ స్కాట్‌ (30 నాటౌట్‌), ఎలిసీ పెర్రీ (31) పోరాడినా.. ఫలితం దక్కలేదు.