తప్పులు మీవీ..భారం మాకా..!

–  ట్రూఅప్‌ ప్రతిపాదనలు తిరస్కరించండి
–  డిస్కంల నిర్వహణ అస్తవ్యస్తం :టీఎస్‌ఈఆర్సీ బహిరంగ విచారణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం, అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) నష్టాలు వస్తే, దానికి వినియోగదారులుగా తామెందుకు పెరిగిన చార్జీలు చెల్లించాలని పలువురు ప్రశ్నించారు. డిస్కంలకు అతిపెద్ద డిఫాల్టర్‌గా ప్రభుత్వ శాఖలే ఉన్నాయనీ, వాటిని ఎప్పటికప్పుడు వసూలు చేసుకుంటే నష్టాలు ఎందుకుంటాయని అడిగారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రగడ్డ జీటీఎస్‌ కాలనీలోని టీఎస్‌ జెన్‌కో ఆడిటోరియంలో బహిరంగ విచారణ నిర్వహించారు. 2023-24 వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు, 2016-17 నుంచి 2022-23 వరకు రిటైల్‌ సరఫరా ధరలు, క్రాస్‌ సబ్సిడీ సర్‌ చార్జీలు, విద్యుత్‌ కొనుగోళ్లు, ట్రూ అప్‌ చార్జీలపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) టీఎస్‌ఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనలపై ఈ బహిరంగ విచారణ జరిగింది. టీఎస్‌ఈఆర్సీ చైర్మెన్‌ తన్నీరు శ్రీరంగారావు అధ్యక్షతన కమిషన్‌ సభ్యులు (టెక్నికల్‌) ఎమ్‌డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్య (ఫైనాన్స్‌) ఈ విచారణ నిర్వహించారు.
అసమర్థ నిర్వహణ ఎమ్‌ వేణుగోపాలరావు, కన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌
2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.10,535 కోట్లు ఆదాయ లోటు ఉంటుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,079 కోట్ల మేరకు కరెంటు చార్జీలు పెంచారు. ట్రూ అప్‌ పేరుతో రూ.900 కోట్లు, రిటైల్‌ సప్లరు బిజినెస్‌ పేరుతో రూ.12,753.56 కోట్లు, డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ ట్రూఅప్‌ పేరుతో రూ.4,092.23 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకొనేందుకు విద్యుత్‌ సంస్థలు టీఎస్‌ఈఆర్సీని అడుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేసినట్టు డిస్కంలు, ప్రభుత్వం చెప్తున్నాయి. అసలు వీటిని టీఎస్‌ఈఆర్సీ ఎందుకు పర్యవేక్షించలేదు? అంతకన్నా తక్కువ ఖర్చుతో పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ సాధ్యాసాధ్యా లను ఈఆర్సీ పరిశీలించాలి కదా? ఆ పని మీరెందుకు చేయలేదు? మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నాటి టారిఫ్‌ ప్రకారమే సబ్సిడీ సొమ్మును విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఇచ్చింది. ట్రూ అప్‌ల భారం రూ.8,790 కోట్లు అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించినదే. ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోకుండా, ప్రజలపై భారాలు వేస్తామనడం సరికాదు. ఛత్తీస్‌గడ్‌ నుంచి రావల్సిన వెయ్యి మెగావాట్లు రావట్లేదు. ఆ రాష్ట్రం యూనిట్‌ రేటును భారీగా పెంచేసింది. ఈ ఒప్పందం జరిగేటప్పుడే అనేకమంది లోటుపాట్లను ఎత్తిచూపారు. ఆరోజు వాటిని పట్టించుకోని ఫలితంగా ఇప్పుడు కరెంటు రాకున్నా తప్పనిసరిగా లక్షల రూపాయలు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలుగా చెల్లిస్తున్నాం. ఓ తొందరపాటు నిర్ణయ ఫలితాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కృత్రిమంగా బొగ్గు కొరత సృష్టించి, ప్రకృతి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే నిర్ణయాలు తీసుకుంది. సింగరేణికి స్థానిక బొగ్గు గనులు కేటాయించకుండా, ఒడిశా రాష్ట్రంలోని గనులు కేటాయించడం ఏంటి? దీనివల్ల రవాణా చార్జీలు పెరిగి, కరెంటు ఉత్పత్తి ధర పెరుగుతుంది. రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్వహణకు సంబంధించి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) చార్జీలను కేంద్రం భారీగా పెంచేసింది. కానీ పీజీసీఐఎల్‌ నుంచి అదానీ పవర్‌కు మినహాయింపు ఇచ్చారు. పవర్‌ ఎక్సేంజీలు నల్లబజారు అడ్డాలుగా మారాయి. ఉత్పత్తిదారులంతా కుమ్మక్కై యూనిట్‌ రేట్లను పెంచేస్తున్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియగానే జెన్‌కోలను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఉత్తర్వులు ఇచ్చింది. 2023-24లో 20 శాతం, 2024-25లో 35 శాతం, 2025-26లో 45 శాతం జెన్‌కోల థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తిని తగ్గించి, సాంప్రదాయేతర ఇంధన వనరులతో భర్తీ చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విదేశీబొగ్గును తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటి వెనుక ప్రయివేటు, కార్పొరేటీకరణే లక్ష్యాలుగా ఉన్నాయి. శాంబ్‌కార్ప్‌ ఎనర్జీ సంస్థ నుంచి ఎవరి అనుమతి లేకుండా డిస్కంలు యూనిట్‌ రేటు రూ.8.33 పైసలకి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకున్నాయి. సింగరేణి నుంచి యూనిట్‌ రేటు రూ.6.92 పైసలకు ఒప్పందం జరిగింది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఈ అధిక ధరలకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పాలి. కానీ మీరు అలా ఎందుకు చేయలేదు? డిస్కంలు ప్రతిపాదించిన ట్రూఅప్‌లు సహా అన్నింటిని ఉపసంహరించుకోవాలి.
ప్రతిపాదనలు తిరస్కరించండి ఉడతా రవీందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం
డిస్కంలు ఆర్థికలోటులో ఉన్నాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వాటిని ఎలా భర్తీ చేసుకుంటారో ప్రణాళిక, వివరణ లేవు. ప్రభుత్వ బకాయిలు సకాలంలో ఎందుకు వసూలు చేయట్లేదు. అవి వస్తే డిస్కంలు అప్పులు, నష్టాల్లో ఎందుకు ఉంటాయి? 2016-17 నుంచి 2021-22 వరకు డిస్కంలు టీఎస్‌ఈఆర్సీకి ఏఆర్‌ఆర్‌లు ఇవ్వలేదు. దానిపై ప్రశ్నిస్తే…ఎన్నికల నియమావళి వల్ల ఇవ్వలేదని రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. పై కాలంలో సమాజంలో ఏ పనీ ఆగలేదు. ప్రభుత్వాలు కూడా మారాయి. అప్పుడు వాటన్నింటినీ దాటవేసి, ఇప్పుడు ట్రూఅప్‌ల పేరుతో భారాలు వేయడం సరికాదు. అంతర్గత సామర్థ్యం ఎక్కడ పెంచుకుంటున్నారు? ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు లేవు. రూ.35 వేల కోట్లతో పంపిణీ వ్యవస్థల్ని ఆధునీకరిస్తే ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు ఫెయిల్‌ అవుతున్నాయి? అదనపు విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్తున్నారు. డిస్కంలు యూనిట్‌ కరెంటును రూ.4.85 పైసలకు కొంటున్నాయి. అదనపు విద్యుత్‌ను యూనిట్‌ రూ.3.20 పైసలకి అమ్ముతున్నారు. ఇదేం సమతుల్యం? కేంద్ర తెచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రీపెయిడ్‌ మీటర్ల భారం వినియోగదారులపై వేయొద్దు.
వృత్తిదారుల్ని వేధించొద్దు పైళ్ల ఆశయ్య, రాష్ట్రప్రధాన కార్యదర్శి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
రజక, క్షౌర వృత్తిదారులను క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది వేధించొద్దు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కేటగిరి-బీలో అమలు చేస్తున్నది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు డబ్బులు రాకుంటే, లబ్దిదారుల కనెక్షన్లు తొలగిస్తున్నారు. సేవారంగంలో జీవనాధారమైన వృత్తికి ఆటంకాలు కలిగిస్తున్నారు. మేనేజింగ్‌డైరెక్టర్‌ స్థాయిలో కనెక్షన్లు కట్‌ చేయోద్దని ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవట్లేదు. ఉచిత మీటర్‌తో పాటు ఇవ్వాల్సిన సర్వీస్‌ వైరు, ఎర్త్‌ వైరు ఇతర పరికరాలను ఇవ్వట్లేదు. కేవలం మీటర్‌ మాత్రమే ఇస్తున్నారు. అలాగే లాండ్రీ షాపులకు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కరెంటు బిల్లులుపైన ఏసీడీ చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్‌ చార్జీల పేరుతో బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అనేక జిల్లాలో ఎర్త్‌ వైర్లు పెట్టకపోవడంతో వృత్తిదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొత్త కనెక్షన్లకు క్రింది స్థాయి అధికారులు సహకరించాలి. రైతులకు ఇస్తున్నట్టు రజకవత్తిదారులకు ప్రత్యేక బీమా సౌకర్యాలు కల్పించాలి.
అంతకుముందు సమావేశంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఏఆర్‌ఆర్‌, ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనల్ని వివరించారు. బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సంఘాలు, వాటర్‌బోర్డు ప్రతినిధులతో పాటు స్వామి జగన్మయానంద, ఎమ్‌ శ్రీధర్‌రెడ్డి, సీహెచ్‌ నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) సహా 37 మంది అబ్జెక్టర్స్‌ పాల్గొని, వారి వాదనలు వినిపించారు. ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ శారదాబాయి ప్రభుత్వ ప్రకటన చదివి వినిపించారు. డిస్కంలకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
భారీ భద్రత
టీఎస్‌ఈఆర్సీ బహిరంగ విచారణ సందర్భంగా టీఎస్‌జెన్‌కో ఆడిటోరియం ప్రాంగణం పోలీసులతో నిండిపోయింది. ఇక్కడ కేవలం 37 మంది మాత్రమే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు అనుమతి తీసుకున్నారు. అయినా పోలీసులు భారీగా మోహరించడం గమనార్హం.
సమస్యలు పరిష్కరిస్తాం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
బహిరంగ విచారణలో వెల్లడైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. వ్యవసాయ విద్యుత్‌ పనులకు జీఐఎస్‌ ఆధారిత పోల్స్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. లూజ్‌ లైన్లు ఉన్నచోట మొబైల్‌ ఆప్‌ ద్వారా ఫోటో తీసి అప్‌లోడ్‌ చేస్తే కంప్లయింట్‌ నెంబర్‌ ఇచ్చి, సమస్యను పరిష్కరిస్తాం. హెచ్‌వీడీఎస్‌ పనుల్లో ఏబీ కేబుల్‌ ఉపయోగించటం వల్ల ఇతర డిస్కంలతో పోలిస్తే మా దగ్గర 50శాతం విద్యుత్‌ ప్రమాదాలు తక్కువ. ఎక్స్‌గ్రేషియా ఫైల్‌ నెలరోజుల్లోపు కార్పొరేట్‌ ఆఫీసుకు చేరేలా చర్యలు తీసుకుంటాం. ఓఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కనెక్షన్‌కు రూ.70వేలు ఇస్తుంది. 25 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ మీద మూడు నుంచి నాలుగు కనెక్షన్లు ఇస్తున్నాం. 5-6 హెచ్‌పీ మోటర్లు ఉన్న నాలుగు వ్యవసాయ కనెక్షన్లకు డిస్కం తరఫున రూ. 2.8 లక్షలు, రైతులనుంచి రూ.20 వేలు తీసుకుని 25 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నాం. రైతులపై ఎలాంటి రవాణా చార్జీల భారం పడకుండాకొత్త విధానాన్ని ప్రవేశపెడతాం.