తీహార్‌ జైలుకు సిసోడియా

–  14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ
–  ఎమ్మెల్సీ కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్‌
న్యూఢిల్లీ : ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 20 వరకూ 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే సిసోడియా బెయిల్‌ అభ్యర్థనపై మార్చి 10న విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. గత శనివారం సిసోడియా కస్టడీని మార్చి 6 వరకూ కోర్టు పొడిగించింది. ఆ గడువు ముగియడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్‌ ఎదుట సిసోడియాను హాజరుపర్చారు. ఆప్‌ సీనియర్‌ నేత అతిషి మర్లెనా కోర్టుకు వచ్చి సిసోడియాను కలిశారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ రాబోయే 14 రోజుల్లో జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోరారు. మార్చి 20 వరకూ సిసోడియాకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్‌ జైలుకు తరలించారు. ధ్యాన గదిలో ఉంచాలని సిసోడియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌కు ప్రత్యేక కోర్టు సూచించింది. డైరీ, పెన్‌, భగవద్గీత, కండ్లద్దాల కోసం సిసోడియా దరఖాస్తును కోర్టు అనుమతించింది. సిసోడియా సీబీఐ అధికారులు నిర్వహించే మెడికల్‌ పరీక్షల్లో సూచించిన మందులను అందచేసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది. మనీశ్‌ సిసోడియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మార్చి 10న సీబీఐ సమాధానం ఇవ్వనున్నది.
ఎమ్మెల్సీ కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్‌
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఏ బుచ్చిబాబుకు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చింది. అదే సమయంలో పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ ఫిబ్రవరి 8న బుచ్చిబాబును అరెస్టు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వద్ద గోరంట్ల బుచ్చిబాబు కొంతకాలం ఆడిటర్‌గా పని చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకూ అభిషేక్‌ బోయినపల్లి, విజరు నాయర్‌, బుచ్చిబాబుకు బెయిల్‌ లభించినట్లైంది.మరోవైపు ఇదే మద్యం కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అమన్‌ దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టారు. అమన్‌ దీప్‌ను ఐదు రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అప్పగించింది. అమన్‌ దీప్‌ సింగ్‌కు సౌత్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్‌ లభించింది. కుల్దీప్‌సింగ్‌, నరేంద్రసింగ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, ముత్తా గౌతమ్‌, సమీర్‌ మహేంద్రులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు తొలి చార్జీ షీట్‌లో ఏడుగురి నిందితులపై అభియోగాలు మోపింది. తొలి చార్జీ షీట్‌లో సమీర్‌ మహేంద్రు, అభిషేక్‌, విజరు నాయర్‌, కుల్దీప్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, ముత్తా గౌతమ్‌ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ కేసులో సమీర్‌ మహేంద్రు, విజరు నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి తీహార్‌ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈడీ నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసులో విజరు నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి బెయిల్‌ పొందారు. కుల్దీప్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, ముత్తా గౌతమ్‌లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. అరుణ్‌ పిళ్ళైని ఈడీ ఇటీవలే ప్రశ్నించింది.