తెలుగురాష్ట్రాల్లో కమల విన్యాసాల విపత్తు

తెలుగు రాష్ట్రాల న్యాయమైన కోర్కెలు నెరవేర్చని కేంద్ర బీజేపీ రాజకీయ వ్యూహాలు, దర్యాప్తు సంస్థల ప్రయోగాలలో మాత్రం ఎత్తులమీద ఎత్తులు వేస్తున్నది. ప్రధాన పాలక పార్టీలను ఇరకాటంలో పెట్టడమే దాని ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ సర్కారుతో నిత్యఘర్షణ పెట్టుకుంటుంటే ఏపీకి కూడా ఆఘమేఘాల మీద మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది. తమిళిసై తాను తమిళనాడు బీజేపీ నేతనన్న విషయం నిరంతరం గుర్తు చేస్తూనే ఉన్నారు. అంతేగాక బీజేపీనాయకులతో పోటీపడి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నారు. ఏపీ గవర్నర్‌గా వచ్చిన నజీర్‌ గతంలో అయోధ్యతో సహా అనేక కీలక కేసుల్లో ఇచ్చిన తీర్పులు బీజేపీకి సంతోషం కలిగించిన ఫలితంగానే ఈ పదవి పొందగలిగారన్నది సర్వజన భావన. జగన్‌ సర్కార్‌కు చెక్‌ పెట్టడానికే ఆయన వచ్చాడని టీడీపీ, బీజేపీ చెబుతుంటే వైసీపీ నేతలు మాత్రం అదేమీ లేదని పైకి గంభీరంగా తోసిపుచ్చుతున్నారు. అయితే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా పోకడలు తెలుసు గనక నిజంగా తేలిగ్గా తీసుకోవడం జరగదు. కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్‌ ఘనస్వాగత సత్కారాలు జరపగా టీడీపీ నేత చంద్రబాబు కూడా కలసి మాట్లాడారు. ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని దృష్టికి తెచ్చారని అనుకూల మీడియా వార్తలు. కొత్తగవర్నర్‌ తాను ఇంకా విషయాలు తెలుసుకోవాలని చెప్పినట్టు కూడా అవి పేర్కొన్నాయి. సుప్రీం మాజీ జడ్జిని పదవీ విరమణ తర్వాత నెలలోనే గవర్నర్‌గా నియమించిన తీరును సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ వంటిపార్టీలు తప్పు పట్టాయి.
బీజేపీ శత వ్యూహాలు
రాజ్‌భవన్‌ రాజకీయాలు అలావుంచితే నేరుగా బీజేపీ సంస్థాగత వ్యవహారాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఏపీలో వెనకబడివున్నా తెలంగాణలో అధికారానికి వచ్చేస్తామని కొన్నాళ్ల కిందట బీజేపీ అగ్రనేతలు కూడా హడావుడి చేశారు. స్వయంగా మోడీ, అమిత్‌షా, అధ్యక్షుడు నడ్డాలు పర్యటించి వెళ్లారు. దక్షిణాదిలో తమ తదుపరి టార్గెట్‌ తెలంగాణ అని గొప్పలు పోయారు. కానీ మునుగోడు ఫలితాల తర్వాత ఇదంతా తారుమారైంది. ఇప్పుడు బీజేపీ నేతలెవరూ అధికారంలోకి రావడం గురించి ఆశలు పెట్టుకోలేదు. పదిహేను స్థానాలు తెచ్చుకుంటే ధన్యమని భావిస్తున్నారు. భారీ ఎత్తున ఇతర పార్టీలనుంచి వచ్చి చేరతారని లెక్కలు వేసింది నిజం కాలేదు. ఒక బలమైన సామాజిక వర్గాన్ని చేర్చుకోవాలనుకుంటే వారు కాంగ్రెస్‌లోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోని పద్నాలుగు మంది ప్రముఖులను ఆకర్షించాలనుకుంటే ఇంతవరకూ వారిని సంప్రదించడమే కుదరలేదట. ఆఖరుకు చేరికల కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ తనే నెమ్మదైపోయారని బీజేపీ నేతలంటున్నారు. ఆపరేషణ్‌ ఫామ్‌హౌస్‌ సుడిగుండం నుంచి సీబీఐ కాస్త విముక్తి కలిగించినా సమస్య మిగిలే ఉంది. మరోవైపున తమ చేతిలోని ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి రోజుకో దాడి చేయిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరిట బీఆర్‌ఎస్‌ అధినేత కుమార్తె కవితతో సహా ఆరోపణలలో ఇరికించి ప్రతికూల ప్రచారం కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఆప్‌ ముఖ్యమంత్రినీ ఉప ముఖ్యమంత్రినీ కూడా చేర్చారు. ఒక సారా వ్యాపారిని అరెస్టు చేయగా అనేకమందిని విచారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు తెలిసినా ఆరువేల కోట్ల మేరకు వివరాలు తమదగ్గర ఉన్నా చట్టబద్దంగా పట్టుకోలేం గనక ఈ కేసును తవ్వితీశామని ఈ మధ్యనే బీజేపీ నేత ఒకరన్నారు. ఇదే కేసులో ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడినీ, పార్లమెంటరీనేత విజయసాయిరెడ్డి అల్లుడి తమ్ముడు శరత్‌ చంద్రారెడ్డినీ కూడా అరెస్టు చేశారు. అడపాదడపా బీఆర్‌ఎస్‌ నేతల వ్యాపార సంస్థలపై ఆకస్మిక దాడులు జరుపుతూ ఒత్తిడి పెడుతున్నారు. ఈ కేసుల్లో పొరబాట్లే లేవనీ, ప్రతి ఆరోపణా అబద్దమని ఎవరూ చెప్పరు. కానీ వాటిపై దర్యాప్తు తీరు మాత్రం కేంద్ర సంస్థలపై బీజేపీ ఒత్తిడి ఫలితమనేది వాస్తవం. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ సహాయకున్ని కూడా ఈడీ విచారించడం ఎప్పుడో తేలిపోయిన బంగారం స్మగ్లింగ్‌ కేసునూ సాగదీయడం కర్నాటక కాంగ్రెస్‌ వారిపైన తమిళనాడులో డిఎంకె మంత్రిపైనా సాగే కేసులు ఇవన్నీ చూస్తే బీజేపీయేతర వ్యతిరేక పార్టీలనే లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఈడీ, సీబీఐతో సహా ఈ సంస్థల అత్యున్నత బాధ్యులంతా ఎక్స్‌నెన్షన్‌పైనే సర్వీసులో ఉన్నారు. ఆ పొడగింపు పద్ధతే తప్పని సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అందువల్ల ఇదంతా సత్యశోధన న్యాయ సాధన కోసమే జరుగుతున్నదని నమ్మడం కష్టం. ఈ ఆరోపణల మధ్యవారుగనక బీజేపీలో చేరేట్టయితే అంతా గప్‌చిప్‌. కాకుంటే అప్పుడప్పుడూ నామకార్థంగా కొన్ని దాడులు చేసి వారు అదుపు తప్పిపోకుండా చూస్తుంటారు. ఇంతకంటే అనేక రెట్లు ప్రత్యక్షంగా జరిగిన తెలంగాణ ఆపరేషన్‌ ఫాంహౌస్‌ గురించి పట్టించుకోరు! ప్రపంచాన్నే ప్రకంపనలకు గురిచేసిన అదానీ విషయంలో నోరు మెదపరు. ఇలాంటి కారణాలతోనే జగన్‌ ప్రభుత్వం కేంద్రంతో సహకరించవలసి వస్తున్నదని అత్యధికుల అభిప్రాయం. గత ఎన్నికల సమయంలో సీబీఐ రాకను నిషేధించి మోడీని సవాలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఇప్పుడు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ జోక్యాన్ని ఆహ్వానించడం ఇక్కడ కొసమెరుపు.
ఏపీ, తెలంగాణ పరిణామాలు
ఆలస్యంగానైనా తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీతో రాజకీయ పోరాటం ప్రారంభించి బీఆర్‌ఎస్‌గా మారడం దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడుప్రాంతీయ పార్టీలు కేంద్ర బీజేపీకి దగ్గరగా విధేయంగా ఉంటున్నాయి. తమలో తాము పోట్లాడుకోవడం తప్ప వీరికి ఏపీ ప్రయోజనాలు, ప్రత్యేకహోదా, లోటుభరీ,్త వెనకబడిన ప్రాంతాల నిధులు, పోలవరం పూర్తి, విశాఖ ఉక్కు రక్షణ వంటి అంశాలపైనైనా కలసిపోరాడాలనే స్పృహ విధానం ఎంతమాత్రం లేవు. ఈ పరిస్థితిని రాజకీయంగా బీజేపీ పూర్తిగా వాడుకుంటున్నది. అయితే ప్రజల్లో మాత్రం వారిపై విముఖత అసంతృప్తి పూర్తిగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైనా నిరసన ఉంది. కాని ఇందులో రాష్ట్రం భాగంపై ఉద్యమాలు తప్ప కేంద్రం జోలికి పోవడానికి టీడీపీ, జనసేన సిద్ధంగా లేవు. ఇక జగన్‌ సర్కారును తీసుకుంటే కేంద్రం ఇచ్చే ఆదేశాలు విధానాలు తుచ తప్పకుండా పాటించేందుకు అత్యుత్సాహం చూపుతున్నది. గతంలో కేసీఆర్‌ కూడా పెద్దనోట్ల రద్దును సమర్థించడంలో బీజేపీ నేతల కన్నా ముందుండేవారని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఉభయులూ కలసి మోడీకి అనుకూలంగా ఓటేసిన సందర్భాలెన్నో. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మారింది గాని వైసీపీ అదే బాటలో కొనసాగిస్తున్నది. తెలుగుదేశం స్వంత గెలుపు ఏకైక అవసరంగా ఇటు అటు మారుతోంది. వామపక్షాలతో కలసి నడిచిన పవన్‌ కళ్యాణ్‌ ముందే పొత్తుపెట్టుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సమీకరణాలు ఎలా మారతాయనేదానిపైనే ఎడతెగని ఊహాగానాలు అంచనాలలో ముంచితేలుస్తున్నారు.
స్వతహాగా బీజేపీకి తెలుగునాట పెద్ద పునాది లేదు. దానికి తోడు కేంద్రం వివక్ష వారిలో తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నది. ఫలితంగావున్న బీజేపీ పని ఎదురీతగా తయారైంది. అంతర్వేది, రామతీర్థం వంటి సమస్యలు రగిలించాలని చూసినా ఆశించిన స్పందన రాలేదు. తెలంగాణలోనూ బండిసంజరు, ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ వంటివారు పచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా ప్రజలు ఆదరించడం లేదు. టీఆర్‌ఎస్‌ నుంచి చేరిగెలిచిన ఈటెల రాజేందర్‌ వంటివారు కూడా జోరు తగ్గించుకోవలసి వచ్చింది. బీఆర్‌ఎస్‌ వామపక్షాలు గట్టిగా నిలిచి తిప్పికొట్టడం ఇందుకు ప్రధాన కారణం. ఆ వాతావరణం ఏపీలోలేదు. బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ వ్యూహాలేమిటనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మునుగోడు ఫలితం తర్వాత మీడియా ఏకపక్షంగా ముగ్గురూ కలసిపోయినట్టే రాసినా ఉభయ కమ్యూనిస్టుపార్టీలూ ఆ కథనాలను తోసిపుచ్చాయి. ఎన్నికల చర్చలు ఇంకా జరగలేదనీ, బీఆర్‌ఎస్‌ మంత్రులూ నాయకులూ కొందరు తోచినట్టు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశాయి. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలసినడిచినా సమస్యలపైన సర్దుబాట్లపైనా తాము కలసి వ్యవహరి స్తామని, గౌరవ ప్రదమైన సంబంధాలే కోరుకుంటామని తేల్చిచెప్పాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీలను సమానంగా చూస్తూ కేసీఆర్‌ ప్రభుత్వంపై ఎక్కువ కేంద్రీకరిస్తున్న కాంగ్రెస్‌ అదే అస్పష్టతలోనూ అనైక్యతలోనూ మునిగివుంది. మునుగోడు తర్వాత జోరు తగ్గిన బీజేపీ ఎకాఎకిన సర్కారులోకి వచ్చేస్తాననే అతిశయాలు తగ్గించుకోక తప్పలేదు. పైగా ఆ ఫలితం చూశాక పెద్ద నాయకులెవరూ ఇతర పాలక పార్టీలలోంచి బీజేపీలోకి దూకేందుకు ఆసక్తిచూపడం లేదనే వాస్తవం మోడీ, అమిత్‌షాలు గ్రహించాల్సి వచ్చింది. టీబీజేపీ అసలైన నేత ఎవరనేదికూడా పూర్తిగా తేల్చుకోలేని స్థితి.
బీజేపీతో కలిస్తే చేటే
ఏపీలోనైతే సోమువీర్రాజు నాయకత్వం అడుగడుగునా విభేదాలను ఎదుర్కొంటున్నది. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనేక మల్లగుల్లాల తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నుంచివచ్చి చేరిన ఎంపీలు, ఇతరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని మళ్లీ పెరగనివ్వరాదనేది కేంద్ర బీజేపీ వ్యూహమని చెబుతున్నా లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకూ పట్టువిడుపులతో మూడుపార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలనేది వ్యూహంగా ఉంది. అయితే విభేదాలు ఎంతవరకూ పోయాయంటే కేంద్రనాయకుడు జీవీఎల్‌ నరసింహారావు, మాజీ మంత్రి పురందేశ్వరి బాహాటం గా వ్యతిరేకించుకునేవరకూ. రాజధాని సమస్యపై పరిపరి విధాల మాట్లాడుతూ ప్రతిష్టంభన పెంచడం ఇందులో భాగమే. విశాఖసీటుపై కన్నేసిన బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై ఆత్మరక్షణలో పడినా ఏదో తాత్కాలికంగా వేగం తగ్గించినట్టు చూపించేందుకు పథకాలు వేస్తున్నది. టీడీపీ కన్నాను చేర్చుకోవడంలో కనిపించే సామాజిక వ్యూహాన్ని వైసీపీ మరింత ఎక్కువగా ప్రయోగిస్తోంది. కులం, మతం ఏది కలసి వస్తుందా అని బీజేపీ చూస్తున్నది. పాత నేస్తం బీజేపీ, ప్రస్తుత నేస్తం టీడీపీ మధ్య జనసేనాని ఊగిసలాడుతూ ఉభయులనూ కలపాలని చూస్తున్నారు. ఆ కోణంలో చూస్తే బీజేపీతో కలసి ఉండే ఏ పొందిక కూడా రాష్ట్రానికి దేశానికి మేలు చేస్తుందంటే అంతకన్నా హాస్యాస్పదం ఉండదు. కేవలం నవరత్నాలనే గొప్పగా చెబుతూ అనేక అప్రజాస్వామిక పోకడలకు పాల్పడుత్నున రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా ప్రజలు ఆమోదించిదిగా లేదు. ప్రత్యేకించి ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలు ఆర్థికవిధానాలు ప్రజలపై భారాలు రైతుల సమస్యలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఏపి సమగ్రాభివృద్ధి, ఆర్థిక సౌష్టవం కోసం కేంద్ర నిరంకుశత్వంపై పోరాటం ఇప్పుడు అనివార్యం. అది నిర్దిష్టంగా ఏ రూపం తీసుకునే ఏ శక్తులు ఏ పాత్ర పోషించేది తెలియాలంటే మరికొంత వేచి చూడాలి. ఎందుకంటే మన మీడియాలో కేవలం ప్రాంతీయ పార్టీల ప్రకారం విభజించి చూసే వారు బీజేపీ అదృశ్య ప్రభావం అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పడం లేదు. ఏకథలు చెప్పినా విభజనానంతర సమస్యలతో సతమతమవుతున్న ఈ రాష్ట్రానికి నష్టం కలిగించే విధానం ఎవరు అనుసరించినా ప్రజలు సహించరు.
– తెలకపల్లి రవి