తోకతో కొట్టేస్తున్నారు!

– భారత్‌ విజయాల్లో లోయర్‌ ఆర్డర్‌ పాత్ర
– బంతితో, బ్యాట్‌తో రాణిస్తున్న జడేజా, అశ్విన్‌, అక్షర్‌
విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారలు స్పిన్‌ ఆడలేకపోతున్నారు. కెఎల్‌ రాహుల్‌ ప్రదర్శన తీసికట్టుగా మారింది. రోహిత్‌ శర్మ ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. అయినా, భారత్‌ టెస్టుల్లో దూసుకుపోతుంది. టాప్‌ ఆర్డర్‌లో కీలక బ్యాటర్లు నిలకడగా విఫలం అవుతున్నప్పటికీ స్వదేశంలో అద్వితీయ టెస్టు విజయాలు నమోదు చేస్తోంది. అందుకు కారణం, లోయర్‌ ఆర్డర్‌లో విలువైన ఇన్నింగ్స్‌లు నిలకడగా నమోదు కావటమే. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌ టెస్టులోనూ ఇదే జరిగింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌ బోణీ చేసింది. నాగ్‌పూర్‌ టెస్టు మ్యాచ్‌ను క్రికెట్‌ పండితులు 2017 బెంగళూర్‌ టెస్టుతో పోల్చుతున్నారు. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి రోజు 189 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మంచి ఆరంభం సాధించటంతో చిన్నస్వామిలో ఆతిథ్య జట్టు మరింత వెనుకంజ వేసింది. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 177 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు మంచి ఆరంభం దక్కటంతో ఆసీస్‌కు కష్టాలు తప్పలేదు. అయితే, బెంగళూర్‌లో భారత్‌ పుంజుకుని గుర్తుండిపోయే విజయం సాధించగా..నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా ఆ పని చేయలేదు. అందుకు కారణం, బెంగళూర్‌ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 269/7 వద్ద నిలిచినా.. 276 పరుగులకే కుప్పకూలింది. నాగ్‌పూర్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 240/7తో నిలిచింది. కానీ ఇక్కడ భారత లోయర్‌ ఆర్డర్‌ను ఆస్ట్రేలియా కట్టడి చేయలేకపోయింది. ఏడు వికెట్లు పతనమైనా భారత్‌ మరో 56.2 ఓవర్లు ఆడి 160 పరుగులు జోడించింది. బెంగళూర్‌, నాగ్‌పూర్‌ టెస్టులు దాదాపుగా ఒకే తరహాలో సాగినా.. భారత లోయర్‌ ఆర్డర్‌ ఫలితంలో వ్యత్యాసం చూపించింది. నాగ్‌పూర్‌లో జడేజా, అక్షర్‌, షమి మధ్య రెండు 50 ప్లస్‌ భాగస్వామ్యాలు నమోదయ్యాయి.
తోక భాగస్వామ్యాలు
స్వదేశంలో భారత్‌కు తిరుగులేదు. నాణ్యమైన స్పిన్నర్లు భారత్‌ సొంతం. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ సహా వాషింగ్టన్‌ సుందర్‌లు భారత్‌ను మేటి స్పిన్‌ జట్టుగా నిలిపారు. స్పిన్‌ పిచ్‌లపై మాయజాలంతో పాటు విలువైన పరుగులతోనూ భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో భారత్‌ను ముందంజలో నిలుపుతున్నారు. 2021 ఆరంభం నుంచి స్వదేశీ టెస్టుల్లో భారత్‌ ఏడో వికెట్‌ పడిన తర్వాత 12 సార్లు 50 ప్లస్‌ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసింది. ఈ సమయంలో మరో జట్టుకు ఇన్ని భాగస్వామ్యాలు సాధించలేదు. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ 8 అర్థ సెంచరీ భాగస్వామ్యాలతో రెండో స్థానంలో నిలిచాయి. లోయర్‌ ఆర్డర్‌ 12 అర్థ శతక భాగస్వామ్యాలను భారత్‌ నాలుగు సార్లు వంద పరుగుల భాగస్వామ్యాలుగా మలిచింది. భారత లోయర్‌ ఆర్డర్‌ నిలకడగా ఈ ప్రదర్శన చేయటం అసమానం. లోయర్‌ ఆర్డర్‌లో ప్రతి నాలుగు భాగస్వామ్యాలకు ఓ అర ్థసెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. ఇది సాధారణ విషయం కాదు.
కండ్లుచెదిరే గణాంకాలు
2021 ఆరంభం నుంచి స్వదేశంలో స్పిన్‌ ఆల్‌రౌండర్ల రికార్డు మాములుగా లేదు. వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా సగటు 60కి పైగా ఉండగా.. అక్షర్‌ పటేల్‌ 31.22, అశ్విన్‌ 28.38 సగటుతో పరుగులు పిండుకున్నారు. వికెట్ల మాయగాళ్లు పరుగుల ప్రవాహంలో కదం తొక్కటంతో భారత్‌పై భారత్‌లో టెస్టు విజయం సాధించటం విదేశీ జట్లకు అసాధ్యంగా మారింది. 2017 ఆస్ట్రేలియాతో రాంచీ టెస్టులో సాహా శతకం, అదే సిరీస్‌లో ధర్మశాలలో జడేజా, సాహా భాగస్వామ్యం ఈ కోవలోకే వస్తాయి. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టులో భారత లోయర్‌ ఆర్డర్‌ ఏకంగా ఐదు 50 ప్లస్‌ భాగస్వామ్యాలు నిర్మించింది. ఈ సిరీస్‌లో అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కీలక పాత్ర పోషించారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో లోయర్‌ ఆర్డర్‌ మాయ కొనసాగింది. అక్కడ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ నిలకడగా పరుగుల వరద పారించారు. దీంతో భారత్‌పై టెస్టు విజయం సాధించేందుకు అశ్విన్‌, జడేజా, అక్షర్‌ స్పిన్‌ను ఎదుర్కొంటే సరిపోదు.. ఆ త్రయాన్ని బ్యాట్‌తోనూ సమర్థవంతంగా నిలువరించాలి. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న ఈ త్రయం బ్యాట్‌తో, బంతితో ప్రత్యర్థులతో ఓ ఆట ఆడుకుంటుంది!.