దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి

– ఎన్నికల్లో తేల్చుకుందాం
– అప్పులు చేయడంలో మోడీ నెంబర్‌ 1:మంత్రి కేటీఆర్‌
– చివరి బడ్జెట్‌లోనైనా నిధులు తెప్పించాలని బీజేపీ నేతలకు హితవు
నవతెలంగాణ-కంఠేశ్వర్‌/నిజామాబాద్‌సిటీ
బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంటును రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు రండి.. అందరం కలిసే పోదాం.. ముందస్తు ఎన్నికల్లో మీ సత్తా ఏంటో.. మా సత్తా ఏంటో నిరూపించుకుం దామని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ నగరంలో శనివారం మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. రూ.22 కోట్లతో కంఠేశ్వర్‌ కమాన్‌ వద్ద నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. పాత కలెక్టరేట్‌ వద్ద రూ.50 కోట్లతో ఇందూరు కళాభారతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో విలేకరులలో మంత్రి మాట్లాడారు. గతంలో దేశం కోసం పనిచేసిన 14 మంది ప్రధాన మంత్రులు మొత్తం కలిసి 2014 వరకు రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ అప్పుతో దేశంలోని ప్రతి పౌరునిపై రూ.1,25,000 అప్పు ఉంటుందన్నారు.
రాష్ట్రంలో తాము చేసిన అప్పు భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు. కేంద్రం మాదిరి కార్పొరేట్‌ దోస్తులకు పంచి పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ చివరిదని, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈసారైనా అధిక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దేవుడంటున్న బీజేపీ నేతలు ఏ విషయంలో ఆయన దేవుడో స్పష్టత ఇవ్వాలన్నారు. గ్యాస్‌ ధర పెట్రోల్‌ ధర నిత్యవసర సరుకుల ధరలు పెంచినందుకు దేవుడా? ప్రజల సొమ్మును కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నం దుకు దేవుడా..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి, ఇక్కడ ఉన్న జూట్‌ బోర్డును ఎత్తేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణపై కక్ష సదింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న పన్నులను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నినాదం సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా జీవన్‌, సబ్‌ కా బక్వాస్‌ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ సంస్కారహీ నంగా మాట్లాడుతున్నారని, కానీ తాము మాటల్లోకి దిగితే మీ తాత, తండ్రి గుర్తుకు వస్తారని అన్నారు. పెద్దాయన కొడుకువని ఊరుకుంటున్నామని, మీ తండ్రి(డీఎస్‌ను)ని గౌరవిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెఆర్‌.సురేష్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ , బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
ముందస్తు అరెస్టులు
మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీని నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రిని పర్యటనను అడ్డుకుంటామని పిలుపునివ్వడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేశ్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. మంచిప్ప భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టకుండా ఆ గ్రామంలో పోలీస్‌ పికెట్‌ నిర్వహించారు. ముంపు బాధితులెవరూ ఊరి దాటి వెళ్లకుండా బందోబస్తు చేపట్టారు. కాగా, కాన్వారును అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.