దేశంలో అసమర్థ పాలన

–  తెలంగాణపై బీజేపీ సర్కార్‌ పక్షపాత ధోరణి
–  సింగరేణిని ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదు
–  75 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసింది?
– మూడోసారి అధికారం ఇవ్వండి.. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం :మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని, కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, మళ్ళీ అధికారంలోకి రావడం జరగదని, కాబట్టి మూడోసారీ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి అభివృద్ధిని మరింతగా చేపడతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. గురువారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో మంత్రులు జగదీష్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలో ఉన్న పక్క రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి తమను తెలంగాణ రాష్ట్రంలో కలపండని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాల, ఐఐఎం, ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఇక్కడి ప్రజలను ఎలా ఓట్లడుగుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, బండి సంజరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్థి ఐన ప్రగతిభవన్‌, సెక్రటేరియట్‌ కూల్చాలని రేవంత్‌ రెడ్డి, బండి సంజరు అనడం అవివేకం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పదిసార్లు అధికారం అప్పగిస్తే ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రైతుల ను, ప్రజలను, యువతను మరిచిపోయి దిక్కు మాలిన పాలన కొనసాగించారని విమర్శించారు. తెలంగాణలో బరాబర్‌ కుటుంబ పాలనే సాగుతుందని, రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలు కేసీఆర్‌ కుటుంబమేనని, అందుకే తమది కుటుంబ పాలనని తేల్చి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ఉచిత కరెంటు రైతు బంధు, రైతు భీమా ఇచ్చి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంను నిర్మించి దేశంలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్నాడని ఆసరా, గీత, నేత కార్మికుల కొందరికి పింఛన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. భూపాలపల్లికి బైపాస్‌ రోడ్డు, ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తానని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరిక మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీకి వెంటనే రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే రూ.25 కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు కేటాయిస్తున్నామన్నారు. చలివాగు ప్రాజెక్టు కోసం రూ.10 కోట్లు, భీం గణపురం ప్రాజెక్టు కోసం రూ.30 కోట్లు మంజూరు కోసం సీఎంతో చర్చించి ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు రూ.261 కోట్ల చెక్కును మంత్రి అందించారు. ముదిరాజ్‌లు.. చేపల వల, బుట్టను కేటీఆర్‌కు బహూకరించారు. సభలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్‌, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు జ్యోతి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిని, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లపు శోభరఘుపతిరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌ వెంకటరాణి సిద్దు, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్‌ రెడ్డి, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.