– బీజేపీతో దేశమనుగడకు ప్రమాదం
– ఖమ్మం జిల్లాలో ఆశించిన అభివృద్ధి లేదు..
– పారిశ్రామికంగా ముందుకెళ్లాలి
– పోడు సర్వేలో చాలా లోపాలున్నాయి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అధికారం, పదవి వస్తాయి.. పోతాయి.. కానీ మనుషుల మధ్య ద్వేషాలను పెంచే రాజకీయాలను మాత్రం ఎవరూ ఆశ్రయించవద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో లేక ఇతర పేర్లతో హడావిడి చేసిన మిత్రులందరూ తనకు గౌరవనీయులే అన్నారు. ఒకప్పుడు తాము వారికి సహకరించిన వాళ్ళమేనని చెప్పారు. కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి.. ఖమ్మం సంస్కృతి ఇక్కడున్న విలువలను కలుషితం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న సమాజం మనదని, అటువంటి చోట బీజేపీ పెరిగితే ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. బీజేపీతో దేశమనుగడకు ప్రమాదం పొంచివున్నదని తెలిపారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకత ఉందని, రాష్ట్రమంతా ఒక ఆలోచన చేసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రత్యేక ఆలోచన చేసి చైతన్యం చాటిందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల తర్వాత ధోరణులు, వార్తలను చూస్తుంటే తన అభిప్రాయం పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశానన్నారు. మనుషుల మధ్య ద్వేషాలను పెంచే రాజకీయాలతో తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుందని ఆశించినా.. భావించినా.. అంచనా వేసినా.. దీర్ఘకాలంలో అది తప్పవుతుందని, నష్టం జరుగుతుందని మాత్రం విజ్ఞప్తి చేయదలిచానని తెలిపారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదని, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, డివైడర్లు అభివృద్ధిలో భాగమైనా వాటితోనే సరిపోదని తెలిపారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యం మేరకు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో దళితులు, గిరిజనులు అత్యధికంగా ఉన్నారని, అటువంటి ఈ జిల్లాలో నియోజకవర్గానికి కేవలం 500 దళిత బంధు యూనిట్లు సరిపోవు అన్నారు. పోడు పట్టాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని తెలిపారు. 36 ఏండ్లుగా స్థానికంగా నివాసం ఉంటేనే పట్టాలిస్తామనడంలో అర్థం లేదన్నారు. టీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తూనే.. జిల్లా అభివృద్ధికి సూచనలు చేయాలని పార్టీ జిల్లా కమిటీకి సూచిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ పునరుత్తేజాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, వై విక్రమ్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, కల్యాణం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.