నాసిక్‌లో అకాల వర్షాలు.. పంటలకు తీవ్ర నష్టం

నాసిక్‌ : మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని నిఫాద్‌ డివిజన్‌లోని చందోరి, సైఖేడా, ఓధా, మొహది తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం నుంచి బలమైన గాలుతో కూడిన వర్షాలు ప్రారంభమ య్యాయి. బలమైన గాలులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అర్థరాత్రి నుంచి వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసాయి. ఈ వర్షాలకు గోధుమ, మినుము, మొక్కజొన్న, టమాటా వంటి పంటలు భారీ నష్టాన్ని చవిచూశాయి. మరో వైపు ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగింది. మహారాష్ట్రలో రాబోయే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఈ ఏడాదిలో అకాల వర్షాలతో రైతులు పంటలను నష్టపోవడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో తమిళనాడులోని తంజా వూరు, తిరువారూర్‌, నాగపట్నం, మైలాడుదురై జిల్లాలో అకాల వర్షాలు కురిసి పంటలకు నష్టం కలిగించాయి. దీంతో రాష్ట్రంలోని డిఎకెం ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ప్రకటించింది. హెక్టారుకు రూ. 20 వేల వరకూ అందచేస్తామని తెలిపింది. అలాగే ఈ విషయంపై కేంద్రం మద్దతును కోరుతు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ లేఖ కూడా రాసారు.