నవ తెలంగాణ- సంతోష్ నగర్
వాహనాల రాకపోకలు సాగించే మార్గాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని, జాగ్రత, భద్రతతో కూడిన ప్రయాణాలే సురక్షితమని బేగంపేట టీటీఐ ఏసీపీ జి.శంకర్ రాజు సూచించారు. నిబంధనలు మనం అనుసరించినా… ఎదుటివారితో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. బుధవారం మలక్ పేట నియోజకవర్గం సైదాబాద్ పరిధిలోని మాతశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) ఆధ్వర్యంలో ‘రోడ్డు భద్రత.. ట్రాఫిక్ నిబంధనలు’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మంది విద్యార్థినులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పాటలు వింటూ రోడ్లపై నడవడం చాలా ప్రమాదకరమని ఎన్నో ఘటనలు తెరపై చూపించారు. హెల్మెట్ తప్పనిసరని, ఇక చోదక అనుమతి పత్రం లేదంటే.. వాహనం నడపడం వచ్చినా.. రానట్లేనని తెలుసుకోవాలన్నారు. త్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రోడ్డు భద్రత సైబర్ క్రైమ్ డ్రగ్స్ వాటి గురించి సందేహాలు కూడా వివరిస్తూ అపసవ్య మార్గంలో వెళ్లడం తదితర ఉల్లంఘనలే ప్రమాదాలకు సంకేతాలని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి. హనుమంతరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి నవీన్ కిషోర్, సైదాబాద్ ఎస్సైలు శివాజీ, మీచోక్ మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్‌ఐ గణేష్, సైదాబాద్ ఏఎస్‌ఐ అశోక్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.