నేడు ప్రైమ్‌ వాలీబాల్‌ ఫైనల్‌

కోచి : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ రెండో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. కోచి వేదికగా నేడు టైటిల్‌ పోరులో బెంగళూర్‌ టార్పెడోస్‌, అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ తాడోపేడో తేల్చుకోనున్నాయి. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో కాలికట్‌ హీరోస్‌పై అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ 3-1తో ఘన విజయం సాధించింది. 17-15, 9-15, 17-15, 15-11తో కాలికట్‌ హీరోస్‌పై మెరుపు విజయం సాధించింది. సీజన్‌లో నిలకడగా రాణించిన కాలికట్‌ హీరోస్‌ సెమీస్‌లో చెమటోడ్చినా.. భంగపాటు తప్పలేదు. అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ తరఫున రామస్వామి, డానియల్‌, నందగోపాల్‌, మంజునాథ మనోజ్‌, ముతుసామిలు పాయింట్లు కొల్లగొట్టారు. చార్లెస్‌ జెరోమ్‌ వినిత్‌, జరాడి, జోశ్‌ ఆంటోనియో, రెహమాన్‌, మహేశ్‌ రాజ్‌, మోహన్‌లు మెరిసినా.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లటంలో విఫలమయ్యారు. నేడు తుది పోరు రాత్రి 7 గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.