నేపాల్‌లో కూలిన విమానం

– 68 మంది మృతి.. కనిపించని మరో నలుగురి ఆచూకీ
– బ్లాక్‌బాక్స్‌ లభ్యం..లిక్కర్‌ కింగ్‌ మాల్యాకి చెందిన విమానంగా గుర్తింపు..
ఖాట్మండు: నేపాల్‌లో విమానప్రమాదం జరిగింది. నేపాల్‌ ప్యాసింజర్‌ విమానం ఆదివారం పొఖారా విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది మరణించగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలు గుర్తించగా..మరో నలుగురి ఆచూకీ కనిపించలేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా విమానాలు, పరికరాలు, వాటి ధరలను సిరియమ్‌ ఫ్లీట్స్‌ డేటా సవరిస్తూ ఉంటుంది. 9ఎన్‌-ఎఎన్‌సీ ఎయిర్‌క్రాఫ్ట్‌ 2007లో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (ప్రస్తుతం పనిచేయని సంస్థ) వద్ద ఉన్నది. ఆరేండ్ల అనంతరం ఈ విమానాన్ని 2019లో థాయిలాండ్‌కి చెందిన నోక్‌ ఎయిర్‌ కొనుగోలు చేసింది. తర్వాత నేపాల్‌కు చెందిన యతి ఎయిర్‌లైన్స్‌కి విక్రయించింది. ఈ విమానం లీజర్‌ ఇన్వెస్ట్‌ బ్యాంక్‌ నిర్వహిస్తుండగా, కింగ్‌ ఫిషర్‌ టర్బో లీజింగ్‌ యాజమాన్యంలో ఉన్నది. ఏటీఆర్‌ -72 అనేది రెండు ఇంజిన్ల టర్బోఫ్రాప్‌. ఫ్రాన్స్‌, ఇటలీ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ప్రమాద ప్రాంతం నుంచి ఈ విమానానికి చెందిన బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదానికి కారణం.. వాతావరణం మేఘావతం కావడంతో పాటు విజిబిలిటీ పడిపోవడం వల్లేనని ప్రాథమికంగా తేల్చారు. సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవైన నేపాల్‌లో విమాన యానం సవాళ్లతో కూడుకుంది. ఎవరెస్ట్‌ పర్వతం, సాగర్‌ మాతతో సహా ప్రపంచంలోనే 14 ఎత్తైన పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. ఆకస్మిక వాతావరణ మార్పులతో పాటు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. 2000 సంవత్సరం నుంచి విమానాలు లేదా హెలికాఫ్టర్‌ ప్రమాదాల్లో సుమారు 350 మంది మరణించారు. 1992 తర్వాత ఆదివారం నాటి విమాన ప్రమాదం నేపాల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటని అధికారులు తెలిపారు.