పట్టణ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి

– అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. గురువారం ఆంధ్రమహిళా సభ ఆవరణలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి స్క్రీనింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని ఆశావర్కర్లకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో రూ. 5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని .ఆంధ్రమహిళా సభ ఉద్యోగులు, యూనియన్‌ ప్రతినిధులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆస్పత్రి ఆవరణలో రూ.5 భోజన వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు అవంతి, ప్రణీత్‌, నల్లకుంట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు మేడి ప్రసాద్‌, భాస్కర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.