పదునుతేరాలి

ఆకాశంలో సగానికి అన్ని దిక్కులా ఉత్సవాలు జరుగుతున్న సందర్భాన ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతాయి. మార్చి8 ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. శుభాకాంక్షల మాలలు తయారుగానే ఉంటాయి.కానీ చెప్పుకున్న సమస్యలు తీరవు. చేసిన వాగ్దానాలూ నెరవేరవు. మహిళల స్థితిగతులూ మారవు.లింగవివక్షత రూపుమాపాలని,సమానతను సాధించాలని అందరూ ఏకగ్రీవంగానే ఒప్పు కుంటారు.కానీ ఆచరణలో అడుగులు పడటం కష్టంగానే ఉంటున్నది.ఆధునిక సైన్సు, సాంకేతికత, నైపు ణ్యాలు పెరిగి అభివృద్ధి వేగవంతమైన క్రమంలోనూ మరింత వివక్షకు మహిళ గురవడటం మనం చూస్తున్న సత్యం. అంతేకాదు ఆధునికయుగంలో మరిన్ని కొత్త సవాళ్లు కూడా స్త్రీలు ఎదుర్కొం టున్నారు. పెట్టుబడిదారీవర్గం మహిళను గడప దాటించింది కానీ స్త్రీల పట్ల పురుష సమాజపు మదిని చీకటి కోణంలోనే ఉంచింది.అయితే ఏమీ మారలేదనలేం కానీ రావాల్సిన మార్పులు ఇంకా రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం మహిళా దినోత్స వాన్ని డిజిటల్‌, సాంకేతిక రంగంలో సమానతను సాధించాలనే లక్ష్యం పెట్టుకుని ముందుకొస్తున్న తరుణంలోనే ఇరాన్‌లో బాలికా విద్యను వ్యతిరేకించే మూకలు బాలికల విద్యాలయాలపై విషవాయువులు ప్రయోగించినట్లు తెలిసింది. ఇప్పటికి ముప్పయి స్కూళ్లపై ఈ దాడి జరిగింది.బాలికలను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ ప్రయోగాలు జరిగినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.ఇక్కడే కాదు అప్ఘనిస్తాన్‌లోనూ తాలిబన్ల పాలనలో మహిళల మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.విద్యకు దూరం చేయబడుతూనే ఉన్నారు. మనదేశంలోనూ ఇంకా బాలికలు విద్యగరపడంలో వెనుకబడే ఉన్నారు. ఉగ్రవాదాలు, మతోన్మాదాలు మహిళలను చీకటి యుగాలలోకి నెట్టివేస్తున్నాయి. చదువుకు, సమానతకు బద్ధ విరోధులుగా ఇవి నిలుస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడు ఈ రకమైన మతఛాందస ఆలోచనలను, మూఢవిశ్వాసాలను ప్రచారంలోకి తెస్తున్నారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే శక్తులు ఆధిపత్యంలోకి వచ్చాయి. మనువాదం ప్రకారం స్త్రీలు వంటింటికి పరిమితమై పిల్లలను కని వారిని పెద్ద చేయడమే వారిపనిగా భావిస్తున్నారు. భావించడమే కాదు, బహిరంగంగానే ప్రకటనలు కూడా చేస్తున్నారు. చిన్నతనంలో తండ్రి ఆధీనంలో పెరిగాక భర్త కనుసన్నల్లో ఆ తర్వాత పిల్లల పర్యవేక్షణలో మహిళ ఉండాలనేది ఆ ధర్మ నియమం. స్త్రీకి స్వతంత్రమైన వ్యక్తిత్వం. ఆలోచన, అభిరుచులకు తావు లేదన్నది అందులోని అంత:స్సారం. ఇక ఆడవారు ఎలా వుండాలి. ఏమి కట్టుకోవాలి. ఏది కట్టు కోకూడదు మొదలైన ఆంక్షలతో వారి సమస్త జీవనాన్ని నిర్దేశించమే మనుధర్మం. అది కోరుకునే సంఘ పరివారం, అధికార పీఠమెక్కి నైతిక నియమాలను ప్రవచిస్తున్నది. ఇది మరింత ప్రమాదకరంగా మహి ళలకు పరిణమించింది. ఒకవైపు ఆధునిక మార్కెట్‌ సంస్కృతి స్త్రీని సరుకుగా మారిస్తే, ఈ మత ఛాందసం బానిసగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ రకమైన రెండు దాడులను ఎదుర్కొంటున్నది నేడు స్త్రీలోకం.ఈ రెండు రకాల ఆలోచనల పర్యవసానంగానే స్త్రీలపైన హింస చెలరేగుతున్నది. మొన్నీ మధ్య తెలంగాణలో కేఎంసీలో వైద్య విద్యార్థిని ర్యాగింగ్‌ వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించింది.దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి స్త్రీ అనే చులకన భావనతో ఆ అమ్మాయిని పురుష డాక్టర్‌ సైఫ్‌ హేళన చేయడం. రెండోది కులపరమైన వివక్షనూ ప్రదర్శించడం.ఈ రెండు భావనలూ వెళ్లూనుకొన్న వ్యవస్థలో దుర్మార్గాలు నిత్యకృత్యమౌతునే ఉంటాయి. ఇక పెళ్లికి నిరాకరించిందని బెంగళూర్‌లో దినకర్‌ అనే యువకుడు లీలా పవిత్రను పదహారు సార్లు కత్తితో పొడిచి చంపడం చూస్తే పురుషాధిక్య ఆలోచనలు నేటి యువతలో ఎంత కిరాతక పనికి ప్రేరేపిస్తున్నాయో అర్థమవుతుంది. ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు ప్రభుత్వాలూ, ఆధిప్యత్య రాజ కీయాలు,వ్యవస్థలూ సైతం స్త్రీలకు ద్రోహమే తలపెడుతున్నాయి. హత్రాస్‌ కేసును విచారించిన న్యాయస్థానమూ ముగ్గురు దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది. బిల్కిస్‌బానో కేసులో జైలు శిక్షపడిన నేరస్తులను ప్రభుత్వమే విడుదల చేసింది.అంతేకాదు, లైంగికదాడి, హత్యఘటనలో పాల్గొన్న నేరస్తులకు మద్దతుగా ప్రదర్శనలు తీయడటం, వారికి సన్మానాలు చేయడటం చూస్తుంటే మహిళకు న్యాయం దక్కటం ఎండ మావే అనేది అర్థమవుతున్నది.లైంగికదాడులు చేసే బచ్చాగాళ్ల అంతు చూస్తా మన్న ఇక్కడి కాషాయ దళాధిపతులు, వారి ప్రభుత్వాలు,నాయకులు చేస్తున్న పనులకు ఏం జవాబిస్తారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తు న్నాడని ఆరోపణలు వచ్చినా ఏ చర్యలూ తీసుకోలేదు.ఒకవైపు హింస, దోపిడీకి గురవుతూ మరోవైపు అన్యాయాలను వివక్షతలను ఎదుర్కొంటున్న మహిళ మరింత పదునైన పోరాటాలకు సమాయత్తమైన సవాళ్లను అధిగమించాలి.సమైక్యంగా ఉద్యమించాలి.