నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో సోమవారం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం, శ్రీనిధి డబ్బుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన మహిళలు అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బీజెపి నేత వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేవలం మండలంలోని వడ్డీ లేని రుణాలు 9 కోట్ల 26 లక్షల 16 వేల రూపాయలు మహిళలకు రావాల్సి ఉందని, మండలంలో 6800 మందికి అభయ హస్తం 8 సంవత్సరాలుగా అందజేయకుండా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేస్తుందని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన డబ్బులను వెంటనే విడుదల చేయకుంటే ప్రజా ప్రతినిధులను మహిళలు గ్రామాల్లో తిరగనీయ్యరని హెచ్చరించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజెపి పార్టీ అధ్యక్షుడు రెడ్డిగారి రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బసవ రెడ్డి, చిన్నోళ్ల శంకర్, పైడి రాజశేఖర్ రెడ్డి, కుమారస్వామి, ఏక్ నాథ్, గరిగంటి నర్సింలు, మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, అన్ని మోర్చాల అధ్యక్షులు కార్యదర్శులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.