పెండింగ్‌ బిల్లులపై సుప్రీంకు..

–  గవర్నర్‌ తీరుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు 10 బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గతనెల నుంచి 3బిల్లులు రాజ్‌భవన్‌ లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది.ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను ప్రతివాదులుగా చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ పెండింగ్‌ బిల్లులు…
–  పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు
–  మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు
–  మోటార్‌ వెహికల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు
–  వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు
–  తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
–  ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీ అప్‌గ్రేడ్‌ బిల్లు
–  అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
–  పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ బిల్లు
–  జీఎస్టీ చట్ట సవరణ బిల్లు
–  ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు