పెన్షన్‌ సరుకు కాదు… ఉద్యోగి సామాజిక భద్రత

ప్రభుత్వ సేవలో నిమగమైన ఉద్యోగికి వయసు మళ్ళిన తర్వాత ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చేదే పెన్షన్‌. బ్రిటిష్‌ కాలం నుండి 1950 వరకు పెన్షన్‌ ఇవ్వటం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా చేస్తూ ఉన్నాయి. 1951లో పోరాటాల ఫలితంగా పెన్షన్‌ గ్యారెంటీ స్కీమ్‌ ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వాలు నిర్థారించిన కొంత మొత్తంలో పెన్షన్‌ ఇచ్చేవారు. 1982లో సుప్రీంకోర్టు ‘పెన్షన్‌ భిక్ష కాదు… హక్కు. ఇది ఉద్యోగి సామాజిక భద్రత’ అని తీర్పు ఇచ్చిన తర్వాత త్రిబుల్‌ బెనిఫిట్‌ స్కీమ్‌ అమలులోకి వచ్చింది. పిఆర్‌సిలో స్కేళ్లు మారినప్పుడల్లా పెన్షన్‌లో మార్పులు రావడం, ఉద్యోగి చరమాంకంలో అత్యంత గౌరవపదమైన భృతిగా ఉపయోగపడుతుంది. జనవరి 2004 తర్వాత అపాయింట్‌ అయిన ఉద్యోగికి న్యూ పెన్షన్‌ స్కీమ్‌ పేరుతో, షేర్‌ మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌, గ్యారెంటీలేని పెన్షన్‌, మార్కెట్‌ శక్తుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి తీసుకునే పెన్షన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగి సామాజిక భద్రత కోసం ప్రభుత్వమే ఇవ్వాల్సిన పెన్షన్‌ని మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాల మీదికి ఎందుకు వదిలి పెట్టింది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్‌ బాధ్యత నుండి ఎందుకు తప్పుకుంటున్నాయి? పెన్షన్‌ అనేది నిజంగానే ప్రభుత్వానికి భారంగా మారిందా? పెన్షన్‌ ప్రభుత్వం ఇస్తే ఆర్థిక వ్యవస్థ అంధకారం అవుతుందా? పెన్షన్‌ ఉద్యోగి కొనుక్కోవలసిన (సరుకా) సాధనమా? పెన్షన్‌ హక్కు కాదా? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి.
వస్తువు-సరుకు
తన అవసరాల కోసం ఉత్పత్తి చేసుకునేది వస్తువు. మార్కెట్లో క్రయవిక్రయాల కోసం ఉపయోగించేది సరుకు. సరుకు అనే భావన లాభనష్టాల గురించి మాట్లాడుతుంది తప్ప, బాధ్యత గురించి, సామాజిక అంశాల గురించి, ఆ మాటకొస్తే మానవత్వం గురించి మాట్లాడదు. 1947 నుంచి 1980 వరకు భారతదేశంలో సంక్షేమ రాజ్యం అమల్లో ఉంది. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వమే అమలు చేసింది. 1980 తరువాత భారతదేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం, బంగారాన్ని సైతం కుదువ పెట్టాల్సి రావడం, అప్పుల కోసం ప్రపంచ దేశాల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశం అప్పు కోసం ప్రపంచ బ్యాంకు తలుపు తట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ బ్యాంక్‌ షరతులకులోబడి తెచ్చుకున్న అప్పు ఫలితంగా ప్రభుత్వం సంక్షేమ బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవటం, ప్రజలకు కావలసిన ప్రతి అవసరం కొనుక్కోవటం (అంటే సరుకుగా మారిపోవటం) ప్రారంభమైంది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు 32సంవత్సరాల కాలంలో ప్రతిదీ సరుకుగా మారిపోయింది. ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మారి పోయింది. ఆఖరికి ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మడం కోసం, కార్పొరేట్లకు అప్పచెప్పటం కోసం కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఏర్పడిన ఆర్థికమాంద్యం వల్ల కార్పొరేట్లకు అవసరమైన పెట్టుబడుల వెతుకులాటలో ఉండగా… భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్న వివిధ రకాల నిల్వలు, పెన్షన్‌ ఫండు నిల్వల మీద ప్రపంచ బ్యాంక్‌ కన్ను పడింది. పరిశ్రమలతో పాటు ఈ దేశంలో ఉన్న సహజ సంపదల మీద కూడా ప్రపంచ బ్యాంకు చూపు పడింది. అప్పుకెళ్లిన ప్రతిసారీ సంస్కరణల పేరుతో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుని ప్రయివేటు రంగానికి కేటాయింపులు చేసేందుకు ఒత్తిడి తేసాగింది. దీనిలో భాగంగానే ప్రజలకిచ్చే సబ్సిడీలపై కోతను విధిస్తోంది. ధరలు పెంచుతోంది. రైతాంగ వ్యతిరేక చట్టాలు తెస్తోంది. కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చేసింది. కార్పొరేట్లకు ఏ కొద్దిపాటి నొప్పి తగలకుండా జాగ్రత్త పడుతోంది. ఎలాంటి పోరాటాలు జరగకుండా నిర్బంధాలు ప్రయోగిస్తోంది. గతంలో ప్రజలకి… ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హక్కులన్నిటిని ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటోంది. దానిలో భాగంగానే హక్కుగా ఉన్న పెన్షన్‌ను కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌గా మార్చింది. అంటే దేశంలో ప్రతిదీ సరుకుగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం కార్పొరేట్లకు కావాల్సిన నిధులు సేకరించే పని చేస్తుందన్నమాట.
ప్రతిదీ మానెటైజేషన్‌
భూమి, గనులు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గాలి, నీరు, పాలు… ఒక్కటేమిటి ఇప్పటి వరకు సహజ సంపదలుగా, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న అన్నీ… ప్రయివేటు సేవలుగా మారుతున్నాయి. అన్ని రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకొని, కార్పొరేట్లకు ఇచ్చేయడం ప్రారంభించింది. 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్‌ రైళ్లు, 1400 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌, 15 రైల్వే స్టేడియంలు, 265 రైల్వే గూడ్స్‌ షెడ్లు మానిటైజేషన్‌ చేస్తున్నారు. 35 వేల కోట్ల విలువ కలిగిన టెలికం ఆస్తులు, 28,747 కోట్ల విలువ చేసే బొగ్గు గనులు, 761 ఖనిజ బ్లాక్స్‌, 12,828 కోట్ల షిప్పింగ్‌ అసెట్ల వేలం, 25 విమానాశ్రయాల మానెటైజేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనివల్ల భవిష్యత్తులో విమానాశ్రయం గేటు దగ్గరికి వెళ్ళినా రైల్వే స్టేషన్‌కి పోయినా బస్‌ స్టేషన్‌కు పోయినా ఆఖరికి ప్రభుత్వ పార్కుల్లోకి పోయినా యూజర్‌ చార్జీల పేరుతో వందలాది రూపా యలు వసూలు చేసే పని జరుగుతున్నది. ఎంటర్‌టైన్‌ మెంట్‌కు కూడా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి. ప్రతిదాన్నీ ప్రభుత్వం సరుకుగా మార్చివేస్తున్నది.
ప్రభుత్వ వైఖరి మారాలి
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని చూడాలి. ప్రజల కష్టాల్ని, భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాలి. పన్నుల భారం నుండి, అధిక ధరల నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రజలకి ప్రభుత్వానికి వారిధిగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల్లో ఏదైనా అంశం మీద అసంతృప్తి ఏర్పడితే దాన్ని చర్చల ద్వారా తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వినటం ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప లక్షణం. వినకపోవడం ఎలాంటి ప్రజాస్వామ్యం? ప్రజల పక్షాన నిలబడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. దీనికి భిన్నంగా కార్పొరేట్లకు, మార్కెట్‌ శక్తులకు లాభాన్ని చేకూర్చే విధానాన్ని అమలు చేసే వైపు ప్రభుత్వాలు నిలబడటం సరికాదు. కార్పొరేట్ల వైపు నిలబడితే ప్రతిదీ భారంగానే మారుతుంది. రోడ్లు వేయటం, ప్రాజెక్టులు కట్టడం, పరిశ్రమలు స్థాపించడం, రైల్వే, ఎల్‌ఐసి, పోస్టల్‌, టెలికం రంగాల నిర్వహణ అన్నీ భారంగానే మారతాయి. దానితో పాటు సామాజిక భద్రతను ఇచ్చే పెన్షన్‌ కూడా భారంగానే మారుతుంది. కనుక ప్రభుత్వాలు కార్పొరేట్లకు లాభం చేకూర్చే వైపు కాకుండా ప్రజల సంక్షేమం వైపు ఆలోచిస్తే… పెన్షన్‌ సరుకు కాదు. సామాజిక భద్రతను ఇచ్చే ఆసరాగా మారుతుంది. ప్రభుత్యాలు ఈ దిశగా ఆలోచించేట్లు మనం పోరాటం చేయాలి. కార్పొరేట్లకు లాభాలను చేకూర్చే సిపిఎస్‌ లేదా జిపిఎస్‌కి వ్యతిరేకంగా ఉద్యమించాలి. పాత పెన్షన్‌ కోసం నిలబడాలి.

ఎస్‌. వెంకటేశ్వర్లు