పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలి

– నెల్లుట్లలో గుడిసె వాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలి
– ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా
నవతెలంగాణ-జనగామ
నెల్లుట్లలోని గుడిసె వాసులకు, నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి, కనీస సౌకర్యాలు కల్పిం చాలని డిమాండ్‌ చేస్తూ జనగామ కలెక్టరేట్‌ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడిసె వాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 1500 మందికి పైగా నిరుపేద ప్రజలు కలెక్టరేట్‌ ఎదుట బైటాయించారు. ధర్నాకి సింగార రమేష్‌ అధ్యక్షత వహించగా రైతు సంఘం నాయకులు మోకు కనకా రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకటరాజం, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని లింగాల ఘన్‌పూర్‌ మండలం నెల్లుట్ల శివారులో పేదల స్వాధీనంలో ఉన్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పట్టాలతో పాటు రూ.5 లక్షలిచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలైన మంచినీరు, కరెంటు కల్పించాలన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే ఎదురయిందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి జీవించే హక్కును ఇచ్చిందని, ప్రస్తుత పాల కులు ఆ జీవించే హక్కును సైతం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విసిగి వేసారిన ప్రజలు నిలువ నీడ కోసం ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెల్లబు చుతు న్నారని అన్నారు. వారికి సౌకర్యాలు కల్పించి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వేధింపులకు గురి చేస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పేదలు తలుచుకుంటే ఎంత గొప్ప ప్రభుత్వాలైన తలవంచక తప్ప లేదని, పేదల స్వాధీనంలోని ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం నాయకులు జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, గుడిసె వాసులు, వందలాది మంది పేదలు పాల్గొన్నారు.